ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్‌ ఆత్మహత్యాయత్నం

Thursday, December 19, 2024

బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్నఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై శేజల్  గురువారంఅపస్మారక స్థితిలో పడివున్నారు. ఆమె బ్యాగులో నిద్రమాత్రలు, సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు పెద్దమ్మ గుడి వద్ద శేజల్‌ను ఆదినారాయణ అనే వ్యక్తి వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాగా చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ సర్కారు తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని శేజల్ సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు.

మాదాపూర్ వద్ద రోడ్డుపై శేజల్ నిద్రమాత్రలు మింగిననట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన శేజల్‌ తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్‌ లెటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరు నెలలుగా ఎమ్మెల్యేపై న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని, ప్రభుత్వం ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతోందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానని ఆమె వాపోయారు.

కాగా, కొన్ని రోజు క్రితం కూడా శేజల్‌ ఢిల్లీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె జాతీయ మహిళా కమిషన్‌, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో, జాతీయ మహిళా కమిషన్‌ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్‌ ఫిర్యాదుపై విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. మరోవంక, గత వారం ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్ ను కలవాలని ఆమె ప్రయత్నించారు.

”ఢిల్లీలో కేసీఆర్ ఇంటి ముందు నిరసన తెలుపుతున్నప్పుడు మంత్రి కేటీఆర్ కలిశారు. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు పార్టీ పెద్దలు కూడా ఉన్నారు. దుర్గం చిన్నయపై కచ్చితంగా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. నన్ను హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పారు” అంటూ ఆమె ఆ లేఖలో తెలిపారు.

వారం రోజులకి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారని, కానీ మొన్న కేటీఆర్ చేసిన వాఖ్యలు తనకు నమ్మకద్రోహం చేసినట్టు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై లైంగిక దాడి జరగలేదని  కేటీఆర్ చెప్పారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చంపడానికి దుర్గం చిన్నయ్య ప్రయత్నిస్తున్నాడని, తనను  ఎప్పుడు చంపుతారో తెలియదని పేర్కొంటూ పెద్దమ్మ తల్లి తనను కాపాడాలంటూ ఆ లేఖలో ఆమె వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles