ఏపీలో దొంగ ఓట్ల కట్టడికి గూగుల్ మ్యాపింగ్ .. టిడిపి సూచన

Wednesday, December 18, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై ఆధారాల సేకరణలో కీలక భూమిక వహించిన గూగుల్ మ్యాపింగ్  ను ఏపీలో యథేచ్ఛగా మారిన దొంగ ఓట్లను అరికట్టడంలో ఉపయోగించాలని ఎన్నికల కమీషన్ ముందు రాష్ట్ర టీడీపీ నేతలో ఓ ప్రతిపాదన ఉంచారు. అందుకు కమిషన్ సూత్రప్రాయంగా సుముఖత వ్యక్తం చేయడంలో అమలులోకి వస్తే మొత్తం దేశంలోనే ఓ నూతన వరవడి శ్రీకారం చుట్టిన్నట్లు కాగలదు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగే సంవత్సరంలో భారీగా దొంగల ఓట్లను నమోదు చేయించడం, తమకు ఓటు వేయరనుకున్న వారి ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడం గత ఇరవై ఏళ్లుగా ఒక ప్రవాసంగా నడుస్తున్నది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ గెలుపొందడానికి ప్రధాన కారణం దొంగ ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించగలగడం.

నాటి కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోకపోయినా మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి పట్టుదలగా ఎన్నికల కమీషన్ చుట్టూ తిరిగి గుంటూరు జిల్లాలో దొంగ ఓట్లపై పరిశీలనకు కమీషన్ సలహాదారుడు కేజే రావును పంపేటట్లు చేశారు. ఆయన క్షేత్రస్థాయిలో పలు కాలనీలలో ఇంటింటికి తిరిగి వేలసంఖ్యలో దొంగఓట్ల నమోదు గుర్తించారు. ఆ తర్వాత కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ తీసుకొని సుమారు 30 లక్షల దొంగఓట్లను తొలగించింది.

ఇప్పుడు వైసిపి ప్రభుత్వం కూడా రాష్త్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దొంగఓట్లు నమోదు చేయిస్తున్నది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో కనీసం విద్యార్హత లేనివారిని కూడా ఓటర్లుగా నమోదు కావడం పలుచోట్ల బయటపడింది. అదేవిధంగా తమకు ఓటు వేయరనుకున్న వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారు.

దానితో ఏపీలో యధేచ్ఛగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని టిడిపి నేతలు నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఇవే అంశాలను టిడిపి నేతలు గతంలో పలుమార్లు సీఈవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అయినా పట్టువదలకుండా పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు.

తాజాగా,  అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, బొండా ఉమ, అశోక్ బాబు, దివి శివరాం తదితర టీడీపీ నేతలు ఏపీ సీఈవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

టిడిపి తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై క్షేత్రస్థాయిలో విచారించి, చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని ధ్వజమెత్తారు. దొంగ ఓట్ల నమోదుతో సరికొత్త రికార్డులతో జగన్ ప్రపంచంలోనే 8వ వింత నమోదు చేశాడని విమర్శించారు.

దొంగ ఓట్ల వ్యవహారంపై టిడిపి న్యాయపరంగా, క్షేత్రస్థాయిలో పోరాడి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఆటకట్టిస్తుందని స్పష్టం చేశారు. “2019 తర్వాత జరిగిన ఎన్నికలన్నింటిలో (ఏ ఎన్నికైనా సరే) జగన్ వ్యవస్థల్ని మేనిప్యులేట్ చేసి గెలిచాడు తప్ప, ప్రజాబలంతో కాదు. 2100 ఇంటి నంబర్లతో లక్షా 85 వేల దొంగ ఓట్లు చేర్పించారు” అని ఆరోపించారు.

14 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఇష్టానుసారం దొంగ ఓట్లు చేర్పించింది. ఈ దొంగ ఓట్ల తంతుకి సంబంధించిన ఆధారాల్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ముందు ఉంచామని వెల్లడించారు.  ఒక్కో ఇంటిలో 50 నుంచి 500 వరకు దొంగ ఓట్లు చేర్పించారు. ఈ దొంగ ఓట్లపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని డిమాండ్ చేశారు.

 “మీరు చెప్పిన అంశాలు మా దృష్టికి కూడా వచ్చాయని ఎన్నికల కమిషనర్చెప్పారు. అయితే, చాలాచోట్ల బీఎల్ వో లు ఇంటింటికీ వెళ్లకుండా ఎక్కడో ఒకచోట కూర్చొని ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలపై టిక్కులు పెడుతున్నారని ఆయనతో చెప్పాం. దానివల్ల దొంగ ఓట్లు తొలగించడం సాధ్యంకాదని చెప్పాం” అనిఅచ్చెన్నాయుడు

తెలిపారు .

కాబట్టి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్ లోని హౌస్ మ్యాపింగ్ సాయంతో బీఎల్ వో లు గ్రామానికి వెళ్లాక, ఇంటింటికీ తిరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చని చెప్పామని వెల్లడించారు. తాము సూచించిన విధంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దొంగఓట్లను కట్టడి చేయడంపై తప్పకుండా ఆలోచిస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారని తెలిపారు.

అక్టోబర్ 17 నాటికి ఓటర్ల జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ బయటకు వస్తుందని, దాన్ని మీ అందరికీ ఇస్తామని, అది చూశాక, మీరు చెప్పిన విధంగా ఇంకా దొంగఓట్లు ఉంటే, ఆధారాలతో సహా మరోసారి ఫిర్యాదు చేయాలని, అప్పుడు తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ చెప్పారని అచ్చెన్నాయుడు వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles