జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర గోదావరి జిల్లాల్లో అప్రతిహతంగా జరుగుతూ ఉండడంతో ఇప్పటి వరకు వైసిపి మంత్రులు, ఎమ్యెల్యేలు మాటల దాడులు జరుపుతుంటే, ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపారం బహిరంగ సభలో ప్రసంగిస్తూ పవన్ వారాహి యాత్రను ఎద్దేవా చేశారు.
“దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ ఇప్పుడు ఓ లారీ ఎక్కాడు. వారాహి అనే లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. దత్తపుత్రుడిలా మనం బూతులు తిట్టలేం. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేం. పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకురాలేం. ఇవన్నీ దత్తపుత్రుడికే పేటెంట్” అని సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగారు.
ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటారని, తాట తీస్తానంటారని, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అంటూ ధ్వజమెత్తారు. పవన్ నోటికి అదుపు లేదని, నిలకడ లేని వ్యక్తి అని దయ్యబట్టారు.
పవన్ లా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం కదా! అని వ్యంగ్యంగా మాట్లాడారు. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొని రాలేమని చెప్పుకొచ్చారు. మనం దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం, పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం అవన్నీ ఆయనకే పేటెంట్ అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
టీడీపీలో టీ అంటే తినుకో, డీ అంటే దండుకో, పీ అంటే పంచుకో అని సరికొత్త నిర్వచనం చెప్పారు సీఎం జగన్. చంద్రబాబు దోచుకున్న సొమ్ముతో బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేశా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మంచి కూడా చేయలేదన్నారు.ఎన్నికల ముందు మేనిఫెస్టో తెస్తారని, అధికారంలోకి వస్తే ఆ మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తారన్నారు. ఇదీ టీడీపీ ట్రాక్ రికార్డు అని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యా సంస్కరణల కోసం రూ.64,720కోట్లు చేశామని, బట్టన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయులకు ఈ విషయం చెప్పండని అంటూ అసహనంతో మాట్లాడారు. సరిగ్గా అక్షరాలు రాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అంటూ తనదైన శైలిలో సీఎం జగన్ విమర్శలను పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు.
సీఎం జగన్‌కు వరాహికి.. వారాహికి కనీసం తేడా తెలియదా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను గతంలో చెప్పు తీసి చూపించి మాట్లాడానంటే దాని వెనక చాలా జరిగిందని చెప్పారు. తానేదో ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ తెగ బాధపడిపోతున్నారని.. ఇక నుంచి జగన్ స్టైల్‌లోనే ఇలా.. ఇలా మాట్లాడతానంటూ సీఎంను అనుకరిస్తూ సెటైర్లు వేశారు. అసలు అమ్మ ఒడి లాంటి కార్యక్రమంలో సీఎం జగన్ అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డికి ‘అ’ నుంచి ‘‘అం, అ:’’ వరకు అక్షరాలు రావన, దీర్ఘాలు కూడా రావని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. అందుకే జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ముఖ్యమంత్రికి తానే దీర్ఘాలు, అక్షరాలు నేర్పిస్తానని పేర్కొన్నారు. అలాంటి ఒక నియంత, ఒక కంఠకుడు తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉండడం బాధాకరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నెల 30న వారాహి విజయయాత్ర సభ భీమవరంలో ఉంటుందనిచెబుతూ అప్పుడు సీఎం జగన్ గురించి చెబుతా అని ప్రకటించారు.