హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్నటి వరకు బీజేపీలో కొనసాగుతారా? లేదా కాంగ్రెస్ లో చేరబోతున్నారా? అనే విషయమై చర్చ జరుగుతుండగా, అకస్మాత్తుగా మంగళవారం నుండి ఆయన భద్రత గురించి ఆందోళనలు వ్యక్తం కావడం ప్రారంభమైంది. మొదటిసారిగా, మంగళవారం మధ్యాహ్నం ఆయన భార్య జమున మీడియా ముందుకు వచ్చి తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతున్నట్లు సంచలన ఆరోపణ చేశారు.
అంతేకాదు, అందుకోసం వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థిగా రాజేందర్ పై పోటీ చేసేందుకు సిద్దమవుతున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కౌశిక్ రెడ్డి రూ 20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సన్నిహితులతో చెప్పినట్లు తనకు తెలిసిందని ఆమె వెల్లడించారు. ఆమె ఆరోపణలు చేసిన మూడు గంటల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఈటల కూడా తనకు ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పారు. జాగ్రత్తగా ఉండమని కొంతకాలంగా తనను వారిస్తున్నట్లు తెలిపారు.
ఇంతలో, ఆయనకు కేంద్ర హోమ్ శాఖ `వై’ క్యాటగిరీ భద్రత కల్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఈటెల ఆ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చారని, దానితో ఆయన తగు భద్రత కల్పించామని ఆదేశించారని ఈ సందర్భంగా తెలుస్తున్నది.
ఏదేమైనా ఈటెల భార్య జమున చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈటల రాజేందర్ భద్రతపై ఆయన అభిమానులు, అనుచరుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇంతగా ఈ అంశం కలకలం రేపుతున్న తెలంగాణాలో బిజెపి నేతలు ఎవ్వరూ స్పందించకపోవడం గమనార్హం. ఈటెల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేయడం గాని, ఆయనకు భరోసా ఇవ్వడం గాని చేయకపోవడం విస్మయం కలిగిస్తుంది.
మరోవైపు ఈటల భద్రతపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి చర్చించారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని సూచించారు. రాష్ట్ర పోలీసు బలగాలతో ఈటలకు అవసరమైనంత సెక్యూరిటీని కల్పించాలని చెప్పారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈటల భద్రత పెంపునకు సంబంధించి ఈరోజు డీజీపీ సమీక్ష చేయనున్నారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఈటల నివాసానికి వెళ్లి పరిస్థితులను సమీక్ష చేయనున్నారు.
తనను హత్య చేయించేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతూనే తన జాతి భయపడే జాతి కాదని ఈటల కొట్టిపారవేసారు. తాను ప్రజల్లో ఉండే వాడినని, తనకు రక్షణ కల్పించేది ప్రజలేనని వ్యాఖ్యానించారు. నయీం తనను చంపడానికి రెక్కీ నిర్వహిస్తేనే భయపడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ అన్ని పార్టీలలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలందరూ కేసీఆర్‌ను ఓడించాలని అనుకుంటున్నారని స్పష్టం చేశారు. మరోవంక, గత కొద్దిరోజులుగా బిజెపి పట్ల అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్న రాజేందర్ మొదటిసారిగా తాను పార్టీ మారే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు. దుస్తులు మార్చుకున్నట్లు పార్టీలు మారే వ్యక్తిని కాదంటూ చెప్పుకొచ్చారు.
‘జీవితంలో పార్టీలు మారడం అంటే చాలా పెద్ద విషయం. బీజేపీలో నేను అసంతృప్తిగా లేను. పార్టీలన్నప్పుడు బేధాభిప్రాయాలు సహజం. కేసీఆర్‌ను ఓడించడమే నా లక్ష్యం. బీఆర్ఎస్ డబ్బుతో గెలుస్తుంది. ప్రజల ఆశీర్వాదం లేదు. నేను నేనుగా ఎప్పుడూ పిలవకుండా ఢిల్లీ వెళ్లలేదు, పదవి అడగను. పిలిస్తే పోతా.. అడిగితే చెప్తా.. వ్యక్తిగతంగా ఎవరిమీద విమర్శలు చెయ్యను’ అని ఈటల వివరణ ఇచ్చారు.
కాగా, తాను ఈటెల హత్యకు కుట్ర చేస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హత్యా రాజకీయాలు చేసే అలవాటు ఈటల రాజేందర్ కు ఉందని చెబుతూ ఆయన ఉద్యమకారులను ఎంతో టార్చర్ పెట్టారని ధ్వజమెత్తారు. అంతేకాదు 2001లో ఎంపీటీసీ బాల్ రెడ్డిని ఈటల హత్య చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తాను ఆయనను చంపడం కాదు..ఆయనే తనను చంపిస్తారనే భయం ఉందని చెప్పారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంపేందుకు కుట్ర చేసినట్లు కౌశిక్ రెడ్డి ఆరోపించారు.