రేవంత్ కు, తెలంగాణ నేతలకు రాహుల్ మందలింపులు!

Tuesday, November 5, 2024

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుతో చెలరేగిన ఉత్సాహంతో తెలంగాణాలో కూడా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం మరో నాలుగైదు నెలలు మాత్రమే ఎన్నికలకు వ్యవధి ఉండడంతో `ఆపరేషన్ తెలంగాణ’ మిషన్ ప్రారంభించింది.  ఈ సందర్భంగా తెలంగాణలోని పార్టీ నాయకులతో ఏఐసీసీ మంగళవారం జరిపిన స్ట్రేటజీ సెషన్ లో రాహుల్ గాంధీ టిపిసిసి అధ్యక్షుడు, ఇతర నేతలను సున్నితంగా మందగించినట్లు తెలుస్తున్నది.

పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో, చేస్తున్నారో తనకు అన్నీ తెలుసని చెబుతూ నేతల మధ్య విభేదాలు ఉంటే రాష్ట్ర ఇంఛార్జితో లేదా తనతో మాట్లాడాలని స్పష్టం చేశారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట మాట్లాడొద్దని సూచించారు. పార్టీకి సంబంధించిన విషయాలను, నెగెటివ్ న్యూస్‌ మీడియాకు చెప్పొద్దని తెలిపారు. ఒకవేళ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం ఎంతటి వారినైనా అస్సలు ఊరుకునేదే లేదని హెచ్చరించారు.

కర్ణాటక ఎన్నికల్లో అవలంభించిన వ్యూహాలనే తెలంగాణలో చర్చించనున్నట్టు చెబుతూ దాదాపు రెండున్నర గంటలసేపు భవిష్యత్ కార్యాచరణపై పనిచేయాలని మార్గదర్శనం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ చూపుతున్నట్లు తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని చెబుతూ కర్ణాటకలో కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పని చేయటం ద్వారా అధికారంలోకి వచ్చిన అంశాన్ని రాహుల్ గెలుపు వ్యూహంలో ప్రధాన అంశంగా గుర్తించారు.

పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరూ వ్యక్తిగత  అభిప్రాయాల, ఈగోలతో వ్యవహరిచినా ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా వారించినట్లు తెలుస్తున్నది. పార్టీని నడిపించాల్సిన వాడిని నీవే వెనకబడుతున్నావని చెప్పడంతో పాటుగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం.

 పార్టీ పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెట్ తో  పాటుగా సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లోనూ వెనుకబడి ఉన్నారని రాహుల్ తేల్చి చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకోవాలని, సీనియర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసారు.

కాగా, రేవంత్ బృందం తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నట్లు పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాంధీకే ఫిర్యాదు చేశారు. తనను పార్టీలో నుంచి బయటకు పంపే విధంగా పొమ్మనకుండా పొగ పెడుతున్నారని నేరుగా సోనియాకు వివరించారు. ఈ అంశం పైన రాహుల్ నేరుగా రేవంత్ ను నిలదీసినట్లు తెలుస్తున్నది.

మరోవైపు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని రాహుల్ స్పష్టం చేశారు. ఎవ్వరు కూడా డిక్లేర్ చేయొద్దని గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. ఎఐసిసి కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, తదితరలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల కార్యాచరణను కాంగ్రెస్ ప్రారంభించిందని, వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని చెప్పారని తెలిపారు.  మరోవైపు, బీఆర్ఎస్‌లో ఎలాంటి పొత్తులు ఉండబోవని కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పష్టంగా చెప్పినట్లు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. కేవలం రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రతిపక్షపార్టీలతో బీఆర్ఎస్‌తో పొత్తులు ఉండవని అధిష్ఠానం స్పష్టం చేసిందని మధుయాష్కీ గౌడ్ చెప్పారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles