ఈటెల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర?… భార్య జమున ఆరోపణ!

Saturday, January 18, 2025

ఒక వంక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో కొనసాగుతారా? లేదా పార్టీ మారతారా? అనే విషయమై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటే, ఆయన భార్య జమున మంగళవారం మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణ చేశారు. తన భర్తను చంపేందుకు బిఆర్ఎస్ ఎమ్యెల్సీ  కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

అందుకోసం రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నట్లు తనకు తెలిసిందని ఆమె వెల్లడించారు. సీఎం కేసీఆర్ అండతోనే  కౌశిక్ రెడ్డి ఇలా రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ను చంపేస్తామని తమను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ తమ కుటుంభం సభ్యులు ఎవరికైన ఎటువంటి ఆపద ఎదురైనా అందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

2018 ఎన్నికల్లో ఈటెలపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన కౌశిక్ రెడ్డి, గత ఏడాది ఉపఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ లో చేరి ఎమ్యెల్సీ అయ్యారు. ఈ ఏడాది జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థిగా ఈటెలపై పోటీచేయబోతున్నట్లు కొద్దికాలం క్రితం మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

హుజూరాబాద్‌ లో కౌశిక్ రెడ్డి అరాచకాలకు అంతులేకుండా పోతుందని అంటూ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని కూలగొట్టించారని జమున ఆక్షేపించారు. అమరవీరుల స్థూపాన్ని కూల్చిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

మహిళా గవర్నర్‌ను ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదని ఆమె ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ వల్లే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. హుజురాబాద్ సర్పంచ్‌లపై కౌశిక్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆమె  ఆరోపించారు

“కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నారు. ఈ పిచ్చి కుక్కను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్ ప్రజల మీదకు ఉసిగొల్పారు. హుజురాబాద్‌లో ఈ పిచ్చి కుక్క అరాచకాలు పెరిగిపోయాయి. హుజూరాబాద్ ప్రజలు, మహిళల పట్ల ఇష్టానుసారంగా పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తున్నారు” అంటూ జమున విమర్శించారు.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు.  అమరవీరుల స్థూపాన్ని ఉద్యమంలో లేని పిచ్చికుక్క శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి ఆ స్థూపాన్ని కూల్చివేశాడని  ఆమె మండిపడ్డారు.

ఈ సందర్భంగా తన భర్త పార్టీ మారుతున్నాడని, తాను కాంగ్రెస్ లో చేరి ఎన్నికలలో పోటీ చేయబోతున్నామని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా తన భర్త బీజేపీలో గౌరవంగానే ఉన్నారని, పార్టీ మారాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles