కాంగ్రెస్ తో సయోధ్య కోసం ఓవైసీ ఎత్తు!

Friday, November 22, 2024

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో ఉద్యమ పార్టీగా 2014లో గెలుపొందగానే స్వయంగా ఇంటికి వెళ్లి అప్పటి నుండి కలిసి ఉందామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహహస్తం అందించారు. అంతేకాదు, తన మంత్రివర్గంలో ఎంఐఎంను చేరమని ఆహ్వానించారు. అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడికి ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వజూపారు.

అయితే, కేసీఆర్ మంత్రివర్గంలో చేరకపోయినా అప్పటి నుండి కేసీఆర్ కు అండగా ఉంటూ వస్తున్నారు.  ఓవైసీ ఏది చెబితే అది కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతుంది. అయితే అధికారికంగా ఎన్నికల పొత్తు మాత్రం ఉండదు. అంతకు ముందు కాంగ్రెస్ తో ఉన్న  అవగాహన అమాదిరిగానే పాత బస్తీలో హిందువుల ఓట్లను చీల్చే అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ఎంఐఎం అభ్యర్థులు గెలిచేందుకు సహకరించారు.

అందుకు ప్రతిగా, తెలంగాణ వ్యాప్తంగా ముస్లింల తగు సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో బిఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ఇస్తూ వచ్చింది. అందుకనే ఉత్తర ప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు వెళ్లి అసలు బలం లేకపోయినా పెద్ద సంఖ్యలో సీట్లలో అభ్యర్థులను నిలబెట్టిన ఓవైసీ ఎప్పుడూ తెలంగాణాలో పాతబస్తీ దాటి నిలబెట్టడం లేదు.

కానీ ఇప్పుడు బిఆర్ఎస్ తో సయోధ్యకు తెగతెంపులు చేసుకొని, కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు సిద్దమైనట్లు స్పష్టం అవుతుంది.  అధికారం ఎప్పుడూ ఎవ్వరికి శ్వాశతం కాదని.. పవర్ మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరి స్తున్నారని…. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో వాలని బిఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. “తెలంగాణ లో మా క్రికెట్ బ్యాటింగ్ మేము ఆడతాము.. మా స్కోర్ మేము చూసుకుంటాం.. ఆపై ఎవరిని అవుట్ చేయాలి అనేది ఆలోచిస్తాం” అని ప్రకటించడం ద్వారా ఇక బిఆర్ఎస్ తో సంబంధం లేదనే సంకేతం ఇచ్చారు.

ఇదే సమయంలో  గత శుక్రవారం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల భేటీకి తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా పరోక్షంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలతో కలిసి బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తామని సంకేతం ఇచ్చారు. ఇతర ప్రతిపక్షాలు తనను పిలిచినా, పిలవక పోయినా 2024లో కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు తాము వ్యక్తిగతంగా శాయశక్తులా ప్రయత్నం చేస్తామని ప్రకటించారు.

ఓవైసీ వైఖరిలో ఈ విధమైన మార్పు రావడానికి ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ముస్లింల ఓట్లను చీల్చి పరోక్షంగా బిజేపికి సహాయం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ విధంగా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో బిజెపికి సహకరించినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తున్నది.

ఇటీవల కర్ణాటకలో అటువంటి ప్రయత్నం చేస్తే ముస్లిం పెద్దల నుండే ఓవైసీ హెచ్చరికలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇక్కడ ముస్లిం ఓట్లను చీల్చి బిజెపికి సహకరించవద్దని స్పష్టం చేశారు.  దానితో తోకముడచవలసి వచ్చింది.  ఏమైనా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలనే పట్టుదలతో ముస్లింలు ఒకటిగా కాంగ్రెస్ కు ఓటువేశారు. అందుకనే సాంప్రదాయకంగా జేడీఎస్ కు ఓట్లువేసే ముస్లిముల కూడా ఈ సారి మారడంతో ఆ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి.

అందుకనే కర్ణాటక ప్రభావం పొరుగున ఉన్న తెలంగాణపై కూడా ఉండవచ్చని, ఇక్కడ కూడా ముస్లింలు ఐక్యంగా ఓటు వేస్తే తమపై కూడా ఆగ్రహం చూపించవచ్చని ఓవైసీ ముందుగా జాగ్రత్త పడుతున్నల్టు స్పష్టం అవుతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ బిజెపితో లాలూచి పడినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకనే, బిఆర్ఎస్ తో కలిసి ఉంటె ముస్లింల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చని ఆ పార్టీకి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నారు.

అందుకనే ఈ సారి మొదటిసారిగా తెలంగాణాలో ముస్లింలు ప్రాబల్యం గల నియోజకవర్గాలలో ఇతర జిల్లాలో కూడా అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బిఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. అందుకనే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని, ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles