సంకీర్ణం వస్తుందని కలగంటున్న ముస్లింనేత!

Monday, December 23, 2024

తెలంగాణ రాజకీయాల్లో ఒక చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా అధికారం కోసం తలపడుతున్న మూడు పార్టీలు.. ఎవరికి వారు తామే అధికారంలోకి వచ్చి తీరాలని ఆరాటపడుతూ, వచ్చి తీరుతామని బయటకు చెప్పుకుంటూ ఎన్నికలసమరానికి సన్నద్ధం అవుతుండగా.. ఒక్క పార్టీకి చెందిన మరొక నాయకుడు మాత్రం.. తన పార్టీ కంటె ఆ ముగ్గురి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆ మూడు పార్టీలు కూడా సమానంగా బలపడాలని, సమానంగా సీట్లు సాధించాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఎందుకంటే.. తెలంగాణలో సంకీర్ణం ఏర్పడే పరిస్థితి వస్తే.. అప్పుడు అధికారంలోకి రావాల్సిన పార్టీకి తన సాయం అవసరం అవుతుందని, తాను కీలకంగా చక్రం తిప్పవచ్చునని ఆయన కలగంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 7 సీట్లు మజ్లిస్ గెలుస్తుంటుంది. ప్రస్తుతం ఏలుబడి సాగిస్తున్న భారాసకు మజ్లిస్ మద్దతు అవసరం లేదు గానీ, ముస్లిం ఓటు బ్యాంకును పదిలంగా కాపాడుకునే ఉద్దేశంతో కేసీఆర్ వారితో స్నేహబంధాన్నే కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల  నిజామాబాద్ లో భారాస బోధన్ ఎమ్మెల్యే షకీల్, తనపై హత్యాయత్నం చేశారంటూ మజ్లిస్ కార్యకర్తలపై పోలీసు కేసు పెట్టించడం వంటి పరిణామాలు వారి మధ్య సంబంధాలను కాస్త దెబ్బతీసినట్టుగా కనిపిస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ అక్కడకు వెళ్లి ములాఖత్ లో జైల్లో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు కూడా.

ఈ సందర్భంగా ఆయన జోస్యం చెబుతూ.. రాబోయే ఎన్నికల తర్వాత.. తెలంగాణలో తాము కీలకంగా మారుతామని అంటున్నారు. మా బ్యాటింగ్ మేం చేసుకుంటాం అని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరిని అవుట్ చేయాలో అప్పుడు నిర్ణయిస్తాం అని ఒవైసీ అంటున్నారు. తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా సరే.. 60 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకుంది. 12 మంది భారాసలో చేరిపోయారు. అయితే ఆ ఎన్నికలకంటె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడి ఉందని భావిస్తోంది. బలపడడం కంటె.. ముఠాతగాదాలు తగ్గాయని కూడా అనుకోవచ్చు. గతంలో ఒకే సీటు గెలిచిన బిజెపి కూడా ఇప్పుడు కాస్త బలపడింది. దాంతో మూడు పార్టీలూ మేమే అధికారంలోకి వస్తాం అని అంటున్నారు. ఉన్న సీట్లను వీరు పంచుకుంటే.. ఏ ఒక్కరికీ అవసరమైన 60 సీట్లు రావు. అప్పుడిక తానే కీలకం అవుతానని.. తాను మద్దతిచ్చిన పార్టీనే అధికారంలోకి వస్తుంది.. అనే ఆశ ఒవైసీలో ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles