వైసీపీ పాలనపై నాలుగేళ్ల నరకం పేరుతో టీడీపీ సరికొత్త ప్రచార కార్యక్రమం చేపట్టిందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. కాగా ఈ క్యాంపెయిన్‌లో భాగంగా తొలి రోజు చంద్రబాబు ‘ఇది రాష్ట్రమా….? రావణ కాష్ఠమా?’ అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, పదో తరగతి విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను ప్రశ్నిస్తూ వీడియో రిలీజ్ చేశారు.
నాలుగేళ్ల నరకం అంటూ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను ఇందులో ఉదహరించారు. పదో తరగతి విద్యార్థి సజీవదహనం, ఏలూరు యాసిడ్ దాడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు, మచిలీపట్నం అత్యాచార ఘటనలపైనా నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు.
రాజకీయ కక్షతో మహిళను చంపినా ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడరా? అని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల బిడ్డే అయితే దాడులు చేసిన సొంత పార్టీ నేతల్ని కాపాడతారా? అని ప్రశ్నించారు. ప్రజల బిడ్డే అయితే.. పేదల ప్రాణాలకు వెలకట్టే పెత్తందారు అయ్యేవారా? అని నిలదీశారు.
రానున్న రోజుల్లో గల్లీ నుంచి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ “నాలుగేళ్ల నరకం” కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీడీపీ తెలిపింది.
ఈ కార్యక్రమం దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తుచూపుతూ జనంలోకి మరింత విస్తృతంగా వెళ్లాలని టీడీపీ కొత్త ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రచార కార్యక్రమంలో వివిధ రంగాల వారీగా జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, 40 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ.. ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు. టీడీపీ, వైసీపీ మధ్య పోరాటం ఈ మధ్య సామాజిక మధ్యమాల్లో విస్తృతంగా జరుగుతుంది. ప్రతి రోజూ పరస్పరం విమర్శల ట్వీట్లు, వీడియో చేసుకుంటూ దూషణలకు దిగుతున్నారు.
రెండు ప్రధాన పార్టీల మధ్య సోషల్ మీడియా ప్రచారం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. `వై ఏపీ నీడ్స్ జగన్’ పేరుతో వైసీపీ సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి కౌంటర్ గా టీడీపీ ‘నాలుగేళ్ల నరకం’ పేరు ప్రచారం కార్యక్రమం మొదలు పెట్టింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని, గత పది రోజుల్లోనే మహిళలపై దాడులు, పదో తరగతి విద్యార్థికి నిప్పు పెట్టిన ఘటనలు జరిగాయని టీడీపీ అంటోంది.
వైసీపీ నేతలు ప్రజలపై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శిస్తుంది. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలకూ సరైన భద్రత లేదని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలన్నింటినీ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.