తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలి వైఎస్ షర్మిల తోసిపుచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జులై 8న ఆయనకు నివాళులు అర్పించేందుకు తమ స్వగ్రామం ఇడుపులపాయకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రానున్నారని, ఆ సందర్భంగా తాను రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న తండ్రి కోర్కె నెరవేర్చేందుకు కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయనున్నట్లు ప్రకటించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
పైగా, ఆమెను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించి, ఏపీలో కాంగ్రెస్ ప్రచారంపై ఆమె సారధ్యం వహిస్తారని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ ను రెండు సార్లు కలవడం, రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంతో ఈ కథనాలకు బలం చేకూరింది.
అయితే, తెలంగాణ బిడ్డగానే ఉంటానని, ఇక్కడి సమస్యలపైనే పోరాడతానని స్పష్టం చేయడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపడతాననే ఊహాజనిత కథనాలను ఆమె కొట్టిపారేశారు. “ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి” అంటూ ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు.
అయితే, కాంగ్రెస్ తో పొత్తు విషయమై ఆమె స్పందించక పోవడం గమనార్హం. ఆమె పొత్తుకు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై కాంగ్రెస్ ను స్పష్టమైన హామీ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తున్నది. అందుకోసం తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా పేరున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ఆమెతో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తన ప్రతిపాదనలు పంపించారని చెబుతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసిన సమయంలో కోమటిరెడ్డి ఈ ప్రతిపాదనపై చర్చించారని ప్రచారం జరుగుతుంది. అయితే పొత్తు ప్రతిపాదనకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని, పొత్తు కుదుర్చుకోవడం వల్లన కాంగ్రెస్ కు నష్టమేగాని ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా ఈ విషయంలో రేవంత్ కె మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
పొత్తు పెట్టుకుంటే తమపై విమర్శలు గుప్పించడానికి బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చినట్టవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తమను ఎదుర్కొనడానికి కాంగ్రెస్- చివరికి ఆంధ్ర నాయకురాలు పెట్టిన కొత్త పార్టీని ఆశ్రయించిందంటూ బీఆర్ఎస్ విమర్శించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ భావాలను కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టవచ్చని, ఇది తమకు మైనస్‌లా మారుతుందనేది రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
అటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సైతం రేవంత్ వాదనలతో ఏకీభవిస్తుంది. షర్మిల పార్టీతో పొత్తు కంటే విలీనమే బెటర్ అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. దీనితో షర్మిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందువల్లనే ఆమె ఆమె కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాయబారం నడిపిస్తున్నారని చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ ఆత్మగా పేరొందిన డా. కెవిపి రామచంద్రరావు షర్మిలకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారు. డీకే శివకుమార్ తదితరులతో ఆమె భేటీలకు ఆయనే రంగం సిద్ధం చేశారని, కాంగ్రెస్ అధిష్టానంతో సహితం ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తున్నది.