షర్మిలక్క ఎంట్రీకి ముందే షాకులు ఇస్తున్నారా?

Thursday, December 19, 2024

వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తుందని, ఆమె కోరుకున్నట్టుగాకు ఆమెకు ఖమ్మం జిల్లా పాలేరు టిక్కెట్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగానే ఉన్నదని ఇటీవల వార్తలు హోరెత్తుతున్నాయి. అయితే లోలోపల జరుగుతున్న కొన్ని రాజకీయ సమీకరణలను పరిశీలించినప్పుడు.. షర్మిలక్క కాంగ్రెసులోకి ఎంట్రీ ఇవ్వకముందే.. ఆమెకు పార్టీ షాక్ ఇవ్వబోతోందా అనే అనుమానాలు పుడుతున్నాయి. గెలిచినా ఓడినా తన సొంత పార్టీ మీద రాజకీయం చేసుకోవడమే మేలని, క్షణానికోతీరుగా మారుతూ ఉండే కాంగ్రెస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోవడమే మంచిదని అనిపించేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎలాగంటే.. ఒక సుదీర్ఘమైన కారణాన్ని వివరంగా చెప్పుకోవాలి.

వరంగల్ జిల్లా నుంచి రామసహాయం సురేందర్ రెడ్డి అనే వృద్ధ కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఉన్నారు. తెలంగాణ కాంగ్రెసుకు పెద్దదిక్కుగా ఉన్న అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. ఆర్ఎస్ అనే పేరుతో ఆయన చాలా పాపులర్. 1965లో మహబూబాబాద్ ఎంపీగా గెలిచినప్పటినుంచి ఆయన మూడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 1996లో తెలుగుదేశం చేతిలో ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆయన ఇక క్రియాశీల రాజకీయాలవైపు చూడనే లేదు. 27 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాను మాత్రమే కాకుండా, యావత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన సీనియర్ నాయకుడిగా ఆయనకు ఆ గౌరవం చిరస్థాయిగా ఉంది. అలాంటి రామసహాయం సురేందర్ రెడ్డి ఇప్పుడు తన వారసుల్ని రాజకీయ యవనికమీదికి తీసుకురావాలని అనుకుంటున్నారు. కొడుకు రఘురామిరెడ్డిని గానీ, మనవళ్లు వినాయక్ రెడ్డి, అర్జున్ రెడ్డి లలో ఒకరిని గానీ ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని ఆయన అనుకుంటున్నారు. ఆయన తన వారసులకోసం ఏ సీటు అడిగితే ఆ సీటు తప్పక ఇవ్వాల్సినంతటి పరిస్థితి కాంగ్రెసు పార్టీకి ఉందని విశ్లేషకుల భావన. 27ఏళ్ల కిందటినుంచి పార్టీ రాజకీయాలకు దూరంగా ఉన్న వృద్ధనాయకుడికి అంతటి ప్రాధాన్యం ఎందుకు.. అనే ప్రశ్నకు కూడా సహేతుకమైన సమాధానమే ఉంది.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భారాసకు దూరమైన తర్వాత.. ఏ పార్టీలో చేరాలా? అనే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు.. వారిని కాంగ్రెసు వైపు ఆకర్షించడంలో సీనియర్ నేత రామసహాయం కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. వారిద్దరి చేరిక కాంగ్రెసు పార్టీకి ఆర్థికంగానూ నైతికంగానూ కూడా చాలాపెద్ద బలం. ఈ నేపథ్యంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ తన అనుచరగణం చెక్కు చెదరకుండా ఉన్న ఆర్ఎస్.. ఆ జిల్లాలో ప్రభావశీలమైన పాత్ర మళ్లీ పోషిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తన వారసులకోసం ఆయన వరంగల్ జిల్లాలోని పాలకుర్తి గానీ, ఖమ్మం జిల్లాలోని పాలేరు సీటు గానీ అడుగుతున్నారని సమాచారం.

పాలకుర్తి నుంచి ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన జంగారాఘవ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గం మారే ఆలోచనతో ఉన్నారు. అయితే ఇక్కడ గతంలో ఎర్రబెల్లి ఏకంగా 53 వేల అఖండ మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో క్లిష్టమైన పాలకుర్తి కంటె ఖమ్మం జిల్లా పాలేరు సీటు తన వారసులకు బెటర్ మరియు సేఫ్ అని రామసహాయం సురేందర్ రెడ్డి అనుకుంటే గనుక.. షర్మిలకు అక్కడ ఛాన్స్ దక్కకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు నుంచి పోటీచేయాలని అక్కడ చాలా యాక్టివిటీ చేస్తున్న షర్మిలకు ఇది ఎదురుదెబ్బ అవుతుంది. కాంగ్రెసులో విలీనం అనే వ్యవహారమే జరగకపోయినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles