కేసీఆర్ నోట `ఓటమి’ భయం.. అమిత్ షాతో కేటీఆర్ భేటీ!

Thursday, September 19, 2024

గత తొమ్మిదేళ్లలో బహుశా ముఖ్యమంత్రి కేసీఆర్ నోట `ఓటమి’ భయం వ్యక్తం కావడం, మరో వంక అకస్మాత్తుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీకి ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ఢిల్లీకి ప్రయాణం కావడం చూస్తుంటే బిఆర్ఎస్ లో మరో ఐదు నెలల్లో జరిగే ఎన్నికల గురించి భయం పట్టుకుందా? అనే అభిప్రాయం కలుగుతుంది.

పఠాన్ చెరువు వద్ద జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో వచ్చే ఎన్నికలలో తిరిగి గెలిస్తే పఠాన్ చెరువు నుండి హయత్ నగర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తామని గురువారం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయన మాటలలో ఇప్పటివరకు ఎప్పుడూ `ఎన్నికల్లో గెలిస్తే..’ అంటూ అనుమానాస్పదంగా మాటలు రాలేదు.

అదే సమయంలో కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ ప్రయాణమయ్యారు. పెండింగ్ ప్రోజెక్టుల గురించి కేంద్ర మంత్రులను కలిసి నిలదీసేందుకు వీడుతున్నట్లు చెబుతున్నా ప్రధానంగా అమిత్ షాతో భేటీ ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు ఎవరూ అమిత్ షాను కలిసిన సందర్భం లేదు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన్నప్పటల్లా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన అంతం కావాలని చెబుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ సహితం అందుకు ధీటుగా కేంద్రంలోని బీజేపీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కూడా కేసీఆర్ స్వాగతం పలకడం లేదు. ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదు.

అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకోవడం ప్రారంభమైంనప్పటి నుండి కేసీఆర్ బిజెపి, మోదీలపై మౌనం పాటిస్తున్నారు. తన విమర్శలను కాంగ్రెస్ పైననే ఎక్కుపెడుతున్నారు. మరోవంక, బిజెపి ధోరణిలో సహితం మార్పు కనిపిస్తుంది.

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 22 రోజుల పాటు ప్రభుత్వం అధికారికంగా సంబరాలు చేస్తుంటే, ప్రతి రోజూ ఆయా రంగాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి నిరసనలు చేపట్టాలని రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపిచ్చారు. అయితే కేంద్ర పెద్దల జోక్యంగా ఆ కార్యక్రమానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కేవలం మోదీ పాలన గురించి ప్రజలకు తెలియ చెప్పేందుకే పరిమితం కావాలని స్పష్టమైన ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో ఎమ్యెల్సీ కవితను అరెస్ట్ చేయక పోవడంతో బిఆర్ఎస్ – బిజెపిల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. `ఢిల్లీలో దోస్తీ- గాలిలో గస్తీ’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరోవంక, కేసీఆర్, కేటీఆర్, కవితల అరెస్ట్ త్వరలోనే జరుగుతోందని, వారికోసం జైళ్లలో గదులు కూడా సిద్ధంగా ఉన్నాయని రెండేళ్లుగా చెబుతున్న బండి సంజయ్ సహితం ఇప్పుడు అసహనంగా కనిపిస్తున్నారు.

‘నా బిస్తర్‌ రెడీగా ఉంది. జేపీ నడ్డా ఒక్క కాల్‌ చేస్తే పదవి నుంచి తప్పకుంటా’ అంటూ సంజయ్ తరచూ అంటుండటం గమనార్హం. ఇటువంటి సమయంలో కేటీఆర్ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. కేవలం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాల గురించే భేటీ అవుతున్నట్లు రాజకీయ వర్గాలలో భావిస్తున్నారు.

తెలంగాణాలో తాము అధికారంలోకి రావడం అసంభవం అని ఎప్పుడో బిజెపి గ్రహించింది. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా వస్తుందనుకొంటే ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోవడం వారికి మింగుడు పడటం లేదు. రాష్త్ర అసెంబ్లీలో బిజెపికి రెండంకెల సీట్లు లభించడం అసంభవం అని తెలుసుకున్నారు. అయితే, కాంగ్రెస్ మరో రాష్ట్రంలో అధికారంలోకి రావడాన్ని మాత్రం సహింపలేరు. తాము అధికారం చేపట్టలేని పక్షంలో బిఆర్ఎస్ రావాలి గాని కాంగ్రెస్ కాదని మొదటి నుండి బీజేపీ ఎత్తుగడగా ఉంది.

తెలంగాణాలో బిజెపి నేతలు కూడా గత నెలరోజులుగా బిఆర్ఎస్ పైకన్న కాంగ్రెస్ పై ఎక్కువగా విమర్శలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సమిష్టి వ్యూహాల గురించి చర్చించేందుకు కేటీఆర్ అమిత్ షాను కలుస్తున్నట్లు తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles