గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే కార్యక్రమం తురుపు ముక్కలాంటిదని, ప్రజలకు ఏం చేసినా చేయకపోయినా ఈ కార్యక్రమం కింద ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం గురించి డప్పు కొడితే సరిపోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ విశ్వాసం. ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం చేసినప్పటి రోజుల్లో మాదిరిగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ద్వారా ఆ ఇంటికి ఏ ఏ కార్యక్రమాలు అందాయో, ఎంతెంత డబ్బు వారి ఖాతాల్లో పడిందో ఒక లేఖ రూపంలో అందజేస్తే.. అక్కడితో ఆ ప్రజలు తమకు రుణపడిపోయినట్లుగా భావించి ఎప్పటికీ తమ పార్టీకే ఓట్లు వేస్తుంటారు- అనేది సీఎం జగన్ ఊహ, నమ్మకం! ‘అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరుగుతూ చేసిన పనులు గురించి చెప్పుకోవడం’ అనే కార్యక్రమం స్వరూపం ఆకర్షణీయమైనదే గాని క్షేత్రస్థాయిలో ఎవరి ఇబ్బందులు వారికి ఉంటున్నాయి. రకరకాల సంక్షేమ పథకాల పేరుతో ప్రజల కాదాలలో డబ్బులు వేస్తున్నారు గాని.. రాష్ట్రంలో నిర్మాణాత్మక అభివృద్ధి ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఎమ్మెల్యేలకు ప్రజలనుంచి ఎదురవుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు స్థానికంగా తమ ప్రాంతాల్లో పేరుకుపోయిన సమస్యల గురించి, చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల వారితో గొడవ పెట్టుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో గడపగడపకు కార్యక్రమం కింద ఇంటింటికి తిరగడం అనేది చాలామంది ఎమ్మెల్యేలకు కత్తి మీద సాము అవుతోంది. ఆ కార్యక్రమం అంటేనే వారు భయపడిపోతున్నారు.
మరోవైపు జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం పేరుతో ఎమ్మెల్యేల వెంట పడుతున్నారు. తాజాగా బుధవారం నిర్వహించిన సమావేశంలో కూడా 15 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారనీ, వారు పనితీరు మార్చుకోకపోతే గనుక వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థులను చూడాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. ఈ రకంగా జగన్ తమ వెంట పడుతుండగా, ప్రజల్లోకి వెళ్ళడానికి ఎమ్మెల్యేలు భయపడి పోతుండడం గమనార్హం. ప్రతిసారీ 15 ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదని అనడమే తప్ప.. వారిమీద చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం ఇప్పటిదాకా కనిపించడం లేదు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మినహా నిర్మాణాత్మక అభివృద్ధి అనేది నామమాత్రంగా కూడా జరగడంలేదని అందరికీ తెలిసిన సంగతే. గ్రామీణ రోడ్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉన్నదని అధికారుల పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాల వలన లబ్ధిదారులు ఒకింత సైలెంటుగా ఉండవచ్చు గాని.. అభివృద్ధి జరగకపోతే మొత్తం సమాజంలోని ప్రజలందరూ కూడా నిలదీసే ప్రమాదం ఉంటుంది. వైసిపి ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం దెబ్బకు సతమతం అయిపోతున్నారని పలువురు భావిస్తున్నారు.