భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకుని అనుబంధం కలిగి ఉన్న ప్రతి పార్టీని ముస్లింలు అనుమానంగా చూడడం సహజం. తమ పట్ల కూడా ఆ పార్టీ ద్వేష భావంతో ఉంటుందని అనుకోవడం కూడా సహజం. అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ముస్లిములతో సమావేశం ఏర్పాటు చేసుకుని, వారికి బోలెడంత భరోసా అందించారు. భాజపాతో కలిసి ఉన్నంత మాత్రాన ముస్లిములు తనను అనుమానంగా చూడాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు. జగన్ హిందువు కాదు గనుక, క్రిస్టియన్ గనుక.. ఆయనను నమ్మి ముస్లింలు ఓటు వేశారని, అయితే తన పార్టీ ఎంపీలు అందరినీ భాజపాకు గుడ్డిగా వత్తాసు పలికేలా చేస్తున్నారని, తాను అలా కాదని, ముస్లిములకు రక్షణగా తాను నిలబడతానని పవన్ కల్యాణ్ వారికి మాట ఇచ్చారు.
అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారంటే.. హిందూ సమాజం అందరినీ గుండెలకు హత్తుకుంటుందని అర్థం. అజారుద్దీన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యారంటే.. ఆయనను మేం ముస్లింలాగా చూడలేదు, మనోడని అనుకున్నాం. వ్యక్తుల్లో ఉన్న మంచి చెడులు చూడాలే తప్ప.. వాటికి మతాన్ని ఆపాదించకూడదు.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ఖచ్చితంగా ఆ వర్గంలో కాస్త భరోసా కలిగించేవే!
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే ముస్లిం బాలిక మీద అత్యాచారం జరిగితే కనీసం మైనారిటీ వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదని పవన్ ప్రశ్నించారు. మీరు సంపూర్ణంగా జనసేన పట్ల విశ్వాసం ప్రకటిస్తే, నేను మీకు ఎప్పటికీ అండగా ఉంటానని అన్నారు.
ఏ మతంలోనైనా విపరీతవాదాన్ని, అతివాదాన్ని ఖచ్చితంగా మనం ఖండించి తీరాలి. ఇతర మతానికి కూడా గౌరవం ఇవ్వాలని ఈ దేశ ధర్మం నాకు నేర్పింది. ముస్లింలలో అభద్రత తొలగిపోవాలి. భారత సమాజం అంత దుర్మార్గమైనది అయితే 17 శాతం మైనారిటీ ఈ దేశంలో బతకగలిగేవాళ్లు కాదు.. అంటూ పవన్ కల్యాణ్ వారికి ధైర్యం చెప్పారు. ఏ దేవుణ్ని పూజించినా ఇబ్బంది లేదు గానీ.. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటేనే తప్పు అని చెప్పారు.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో జనసేన, తెలుగుదేశం పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచేన చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా ఆ కూటమికి వ్యతిరేకం అయ్యే ప్రమాదం ఉన్నదనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం సమాజంలో ద్వేషభావాన్ని తొలగించడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే వ్యక్తులు కొందరు విద్వేషాలను ప్రచారం చేస్తుండవచ్చు గానీ.. పార్టీలకు ఆపాదించకూడదని, బిజెపితో కలిసి ఉన్నంత మాత్రాన ప్రతి పార్టీని దూరం చేసుకోకూడదని పవన్ వారికి చెబుతున్నారు. పవన్ మాటలను ముస్లిం సమాజం నమ్మితే ఆ కూటమికి చాలా లాభం జరుగుతుంది.