తెలంగాణ కాంగ్రెస్ `వార్ రూమ్’ బెంగుళూరులోనే!

Wednesday, January 22, 2025

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ నేతలు సహితం ఎన్నికల మూడ్ లోకి వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం సహితం తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అని ప్రకటించి, మరో కొద్ది నెలల్లో జరుగబోయే తెలంగాణ ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ చేస్తుంది.

అయితే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదని తెలుసు. కేసీఆర్ ప్రయోగించే అస్త్రాలను తిప్పికొట్టడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. కొంతమేరకు బిజెపి డీలా పడిపోవడం కాంగ్రెస్ కు కలిసి వస్తున్నది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభం అవుతున్నాయి.

అయితే, తమ వ్యూహాలను, ఎత్తుగడలను కేసీఆర్ ముందుగానే పసిగట్టి, ఎదురు దెబ్బ తీసే అవకాశం ఇవ్వకుండా చేసేందుకు ఎన్నికల `వార్ రూమ్’ హైదరాబాద్ నుండి కాకుండా బెంగుళూరు నుండి పనిచేయడం ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు తెలంగాణ ఎన్నికలకు సహితం వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే, ఆయన తెలంగాణ నుండి కాకుండా బెంగుళూరు కేంద్రంగానే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

గతంలో సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న డేటా సెంటర్ పై తెలంగాణ సిఐడి పోలీసులు దాడి జరపడం, సునీల్ ను అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. పైగా, అక్కడున్న కంప్యూటర్లు అన్నింటిని స్వాధీనం చేసుకొని, వాటిల్లో గల ఎన్నికల సన్నాహాలు డాటాను విశ్లేషించే ప్రయత్నం చేశారు. అటువంటి ప్రమాదం ఎన్నికల సమయంలో ఏర్పడకుండా చేసేందుకు `వార్ రూమ్’ కార్యకలాపాలు అన్నింటిని బెంగుళూరు నుండి జరుపుతున్నట్లు చెబుతున్నారు.

మరోవంక, తెలంగాణకు ఎన్నికల ఇన్ ఛార్జ్ గా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను నీయమిస్తున్నారని వస్తున్న వార్తలను కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చిన్నప్పటికీ, `అనధికారికంగా’ తెలంగాణ బాధ్యతలు
నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రూపొందించడంలో, పార్టీలో చేరేటట్లు చేయడంలో ఆయన కీలక భూమిక వహిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకొంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వార్లతో ఆయనే నేరుగా మాట్లాడుతున్నారు. వైఎస్ షర్మిలను తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయమని ఆయనే ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు, బిజెపి మాదిరిగా ఒక చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కె జానారెడ్డి, రేణుకా చౌదరి, గీతారెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలకు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరికలు ప్రోత్సహించే బాధ్యతలు అప్పచెప్పారు.

ఈ ఏర్పాటుతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పని సులభం అయినట్లు కనిపిస్తోంది. ఎవరైనా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉంటె వారితో ఒకసారి మాట్లాడి, వారిని ఈ నేతలకు లేదా నేరుగా శివకుమార్ కు కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున వారికి హామీలు ఇవ్వడం, చేరేటట్లు ప్రోత్సహించడం వారు చూసుకుంటున్నారు.

సునీల్ కొనుగోలు బృందం నియోజకవర్గాల వారీగా సేకరించిన నివేదికలను బెంగుళూరులోనే మదింపు చేస్తూ, అందుకు అనువుగా తెలంగాణ నాయకులను సమాయత్తం చేసే కృషి చేస్తున్నారు. ఇప్పుడు సునీల్ ను సిద్దరామయ్య ప్రభుత్వం సలహాదారునిగా నియమించడంతో అధికారిక వర్గాల ద్వారా అవసరమైన సమాచారం సేకరించడం కూడా సులభం కానుంది.

కాంగ్రెస్ వ్యూహాలు అన్ని బెంగళూరు కేంద్రంగా జరుగుతూ ఉండడంతో కేసీఆర్ కు ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుంది సమాచారం అందించడం తెలంగాణ ప్రభుత్వ నిఘా వర్గాలకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.  అందుకని వారు కూడా బెంగుళూరుకు బృందాలను పంపవలసి వస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles