2024లో జరిగే ఎన్నికలు ఒక విధంగా టిడిపి మనుగడకే సవాళ్లు విసిరే ఎన్నికలుగా భావిస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా గెలుపొందాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలు, అంతులేని అవినీతిలానే ఆయుధాలుగా చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, చంద్రబాబు అనగానే అభివృద్ధికి మారుపేరుగా ఇప్పటివరకు ప్రజలలో ఒక రకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. విభజిత ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఎక్కువగా `యానిమేటెడ్ ఇమేజెస్’లలోనే అభివృద్ధిని చూపిస్తూ వచ్చారనే విమర్శలే ఆయన పట్ల ప్రజలలో కొంతమేరకు వ్యతిరేకతకు కారణం అనే విషయాన్నీ ఇప్పటికీ ఆయన గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు.
నాలుగేళ్లుగా జగన్ పాలనలో ఆగిపోయిన అభివృద్ధిని ఏవిధంగా పట్టాలపైకి ఎక్కిద్దామనుకొంటున్నారో ప్రజలకు తెలియచెప్పే విధంగా టీడీపీ మేనిఫెస్టో ఉండాలని అందరూ ఆశిస్తారు. కానీ, నాలుగేళ్లుగా జగన్ చెబుతున్న `నగదు బదిలీ’ పథకాలనే పేర్లు మార్చి, అంతకన్నా ఎక్కువగా ప్రయోజనాలు కలిగిస్తానంటూ చేస్తున్న ప్రకటనలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ప్రశ్నార్ధకరంగా మారుతుంది.
2019 ఎన్నికలకు ముందు హడావుడిగా వైఎస్ జగన్ ప్రకటించిన `నవరత్నాలు’కు విరుగుడుగా పలు సంక్షేమ పధకాలు ప్రకటించి, అమలు ప్రారంభించారు. అయితే ప్రజలు వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మినీ మానిఫెస్టోగా ప్రకటించినా “భవిష్యత్ కు గ్యారంటీ” పేరుతో ప్రకటించిన ఆరు పథకాలతో తర్వాత వైసీపీకి ఏంచేయాలో తెలీయడం లేదని చంద్రబాబు చెబుతున్నారు.
పైగా, ఆయననే టీడీపీ పధకాలను `కాపీ పేస్ట్’గా విమర్శిస్తున్నారని పేర్కొనడం గమనార్హం. టిడిపి నేతలు విమర్శిస్తున్నట్లు `బట్టన్ నొక్కుడు’ తప్పా వైసిపి పథకాలకు కాపీ అని టిడిపి నేతలే పలువురు వాపోతున్నారు. ఇప్పుడు తాజాగా, దసరాకు ప్రకటించే పూర్తి మానిఫెస్టోలో బీసీలలో ఒకొక్క కులానికి ఏమి చేస్తున్నామో చెప్పబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
వీటన్నింటికి మించి, టిడిపి ప్రకటించే మేనిఫెస్టో గురించి ఎక్కడిక్కడ చర్చ జరిగితే, 175 సీట్లలో పోటీచేస్తే, మొత్తం 175 సీట్లలో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కబోవని చంద్రబాబు ప్రకటించారు. 175 సీట్లు కూడా `వై నాట్ 175′ అని ఎప్పుడో జగన్ ఇచ్చిన నినాదంను అనుసరించడం కాదా? మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందనే, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదనో అనుంటే ఒక విధంగా ఉండెడిది. కానీ సీట్ల అంకెల విషయంలో కూడా జగన్ ను కాపీ కొట్టాలా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
టీడీపీ విస్తృత సమావేశంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి చేసిన ఈ వాఖ్యలు `విజనరీ’గా తనను తాను గత రెండున్నర దశాబ్దాలుగా దేశ ప్రజలు గుర్తించే విధంగా చేస్తున్న ప్రయత్నాలకు అద్దంపట్టే విధంగా లేవని చెప్పొచ్చు. కుప్పంలో ఓడిస్తామని జగన్ అంటుంటే, అక్కడ లక్ష ఓట్ల మెజారిటీ రావాలని అంటారు.
పార్టీ అధినేతగా కేవలం తన సీటు గురించి ఆయన ఎందుకు మాట్లాడాలి? అంటే తన సీటులో గెలుపొందడమే తనకు మొదటి ప్రాధాన్యత అనే సంకేతం ఇస్తున్నారా? అభద్రతా భావంకు గురవుతున్నారా? వంటి అనుమానాలకు ఆస్కారం కలిగించినట్లు అవుతుంది.
ఏపీలో శాంతిభద్రతల సమస్యలు, మహిళలపై అత్యాచారాలు వంటి అంశాలను తలెత్తినప్పుడు ఆ రెండు, మూడు రోజులు యేవో ప్రకటనలు చేయడం, బాధితుల పట్ల సంఘీభావం వ్యక్తం చేయడం మినహా ఆయా సమయాలపై పార్టీ విభాగాలు క్రమబద్ధంగా ఆందోళనలు చేపడుతున్నట్లు కనబడటం లేదు.
ఉదాహరణకు విశాఖపట్టణంలో అధికార పార్టీ ఎంపీ కుటుంభ సభ్యులే కిడ్నప్ కు గురయితే అది డబ్బుకోసం జరిగింది కాకపోవచ్చని, ఆర్థికపరమైన వత్తిడులు, బెదిరింపులు ఉండవచ్చని ఎంపీ రఘురామ కృష్ణంరాజు, బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు వంటి వారు ప్రస్తావించారు. కానీ ఈ అంశాన్ని విశాఖలో పెరుగుతున్న మాఫియా ప్రాబల్యంపై టిడిపి ఎందుకు పోరాటాం చేసే ప్రయత్నం చేయలేదు?