బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్.. శరద్ పవార్ స్పష్టం

Thursday, December 19, 2024

బిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించి, దేశమంతా విస్తరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇతర రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా కేవలం మహారాష్ట్రపైననే కేంద్రీకరించడంతో జాతీయ స్థాయిలో ఆయన ఎత్తుగడల గురించి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవంక, ఢిల్లీ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఆయన కుమార్తె కవిత మునిగిపోయినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులలో పేర్కొంటున్నా ఆమెను అరెస్ట్ చేయక పోవడం కూడా పలువురి దృష్టిని ఆకట్టుకొంటుంది.

కవితను అరెస్ట్ చేయకపోవడంతో బిఆర్ఎస్ – బిజెపి బంధం `ఢిల్లీలో దోస్తీ – వీధుల్లో కుస్తీ’ అని అనుకొంటున్నారని, అందుకనే ఇతర పార్టీల వారెవ్వరూ బీజేపీలో చేరడం లేదని ఆ పార్టీలో గత ఏడాది చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొద్దీ వారాల క్రితం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆరోపణలు కురిపించడం తెలిసిందే.  పాట్నాలో నితీష్ కుమార్ జరుపుతున్న బీజేపీ- వ్యతిరేక పార్టీల సమావేశానికి కేసీఆర్ ని ఆహ్వానించకపోవడం గమనార్హం.

తాజాగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహితం బిఆర్ఎస్ ను బిజెపికి బి- టీం అంటూ ధ్వజమెత్తడం కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల వారెవ్వరూ కేసీఆర్ ను నమ్మడం లేదని స్పష్టం అవుతుంది. బిఆర్ఎస్ పెట్టిన తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా అక్కడ తెలుగు వారున్న ప్రాంతాలోనైనా నామమాత్రపు పోటీకి సహితం సిద్ధపడలేదు.

కర్ణాటక ఎన్నికల నుండే పోటీ ప్రారంభిస్తామని, జేడీఎస్ తో కలిసి ప్రచారం చేస్తామని ప్రకటించి ఆ ఎన్నికల వైపు మాత్రం చూడటం లేదు. కేవలం మహారాష్ట్రాలో పర్యటిస్తూ, పలు బహిరంగసభలలో ప్రసంగిస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకొని గ్రామీణ ప్రాంతాలపై, రైతులపై దృష్టి సారిస్తున్నారు.

ఒక విధంగా బిజెపి పట్ల వ్యతిరేకంగా ఉన్న వర్గాల మద్దతు పొందటం ద్వారా, వారి ఓట్లు బిజెపిని ఓడించడం కోసం కృషి చేస్తున్న మూడు పార్టీల కూటమి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. బిజెపి అజెండాలో భాగంగానే ఆయన మహారాష్ట్రపై దృష్టి సారిస్తున్నట్లు భావిస్తున్నారు.  కనీసం తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ వైపు కూడా చూడక పోవడం గమనార్హం.

ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర పర్యటనలో ఉన్న శరద్ పవార్ మాట్లాడుతూ కేసీఆర్ కేవలం కాంగ్రెస్, ఎన్సీపీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీకి చెందిన ‘బీ’ టీమ్ అని తమకు అనిపిస్తుందని పవార్ స్పష్టం చేశారు. కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా చూపించడమే కాకుండా, మహారాష్ట్రలో బలపడేందుకు మొదటి ప్రయత్నంచేస్తుని పేర్కొన్నారు.

ఏ రాష్ట్రంలోనైనా తమ పార్టీని విస్తరించుకునే హక్కు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్.. బీజేపీ బీ టీమ్ కాదా అనేది చూడాలని అంటూ పరోక్షంగా మహారాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో ప్రకాష్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాడి వల్ల కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి ఓటమిని ఎదుర్కొందని పవార్ గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ అటువంటి పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles