మాజీ ఎమ్మెల్యే  దయాకర్‌రెడ్డి పాడి మోసిన చంద్రబాబు!

Sunday, January 19, 2025

సుదీర్ఘకాలం టిడిపిలో సహచరునిగా, సన్నిహితునిగా మెలిగి కాన్సర్ వ్యాధితో అకాల మరణం చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి (63)కి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం భారమైన హృదయంతో నివాళులు అర్పించారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మూడు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన ఆయన ముఖ్యంగా టీడీపీ అధికారంలో లేని సమయంలో వెంట నడిచారు. 

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఆయన స్వగ్రామం పర్కాపురంలో దయాకర్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. దయాకర్‌ సతీమణి మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డిని, కుమారులు సిద్ధార్థ్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డిని ఓదార్చిన అనంతరం జరిగిన అంతిమ యాత్రలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. దయాకర్‌రెడ్డి పాడెమోసి అభిమానం చాటుకున్నారు.

నారాయణపేట జిల్ల మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి క్యాన్సర్ వ్యాధితో చికిత్స తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. ఆయన మరణం విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు పర్కాపురం వెళ్లి దయాకర్ రెడ్డి పార్దివ దేహానికి నివాళి అర్పించారు.
 నిత్యం ప్రజల్లో ఉంటూ, సమర్థుడైన నాయకుడుగా దయాకర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఘనంగా నివాళులు అర్పించారు. 

మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌, మాజీ మంత్రులు డీకేఅరుణ, చిన్నారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నరసింహులు, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి సీనియర్‌ ఎన్టీఆర్‌ కొడుకు నందమూరి రామకృష్ణ, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

దయాకర్ రెడ్డి సతీమణి సీతాదయాకర్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా పని చేశారు. దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగానూ వ్యవహరించారు. తొలి నుంచి చంద్రబాబుతో దయాకర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దయాకర్‌రెడ్డి దివంగత సీఎం ఎన్టీఆర్‌ అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీలో అన్ని స్థాయిల్లో పని చేసిన ఆయనకు ఎన్టీఆర్‌తో, ఆతర్వాత మాజీ సీఎం చంద్రబాబునాయుడుతో అంతే సాన్నిహిత్యం కొనసాగింది.

దయాకర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ నుంచి 1994,1999లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆయన భార్య సీత కూడా టీడీపీ నుంచి 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

 దయాకర్‌రెడ్డి దంపతులు గతేడాది ఆగస్టులో టీడీపీకి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీని వీడాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరిద్దరు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగినా.. ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఇద్దరు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  భార్యాభర్తలు ఇద్దరూ నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ, రాజకీయాల అతీతంగా అందరి ఆదరాభిమానాలు పొందారు. దయాకర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles