2024 ఎన్నికల ప్రచారం లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం (జూన్ 14)న ప్రారంభించనున్న`వారాహి యాత్ర’ను పురస్కరించుకొని సోమవారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మపరిరక్షణ యాగం జరిపారు. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ గావించారు.
సోమవారం ఉదయం 6గం.55 నిమిషాలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టించారు.
స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్యభగవానుడు, ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు.
విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ప్రారంభమైన ఈ యాగం రెండు రోజులపాటు కొనసాగుతుంది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటి చెట్టు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది.
ఇక నుండి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏపీలోనే గడపనున్నారు. అందుకనే రాజకీయాల్లో బిజీగా ఉంటూ షూటింగులు చేయాలనే అంశంపై పవన్ – దర్శక నిర్మాతల మధ్య చర్చ జరిగింది. ఇకపై ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న క్రమంలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగులు చేపట్టాలని నిర్ణయించారు.
పవన్ కల్యాణ్ చేపడుతున్న యాగంలో పాల్గొన్న దేవీ దేవతలను దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. మంగళగిరి తొలిసారి వచ్చానని, ఈ ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇకపై మంగళగిరిలో ఉండబోతున్నారని చెబుతూ పవన్ సినిమా షూటింగులే కాకుండా.. ఇతర సినిమాల షూటింగులను ఇక్కడ కూడా నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నామని వెల్లడించారు.
ఏపీ, బెజవాడ, మంగళగిరి ప్రాంతాల్లో షూటింగులు తీసే అంశంపై దర్శక, నిర్మాతలతో మాట్లాడామని తెలిపారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరుగుతున్నాయని హరీష్ శంకర్ చెప్పారు.