నేడే నెల్లూరులో ప్రవేశిస్తున్న లోకేష్ ‍యువగళం పాదయాత్ర

Thursday, September 19, 2024

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకొని, మంగళవారం సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్నది. ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలయ్యే ఈ పాదయాత్ర నెల రోజుల పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది.

జనవరి 27 కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర సీమ జిల్లాల్లో 1587 కిలోమీటర్ల పొడవున సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల్లో 577కి.మీ పాదయాత్ర చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజుల్లో 507కి.మీ, అనంతపురం జిల్లాలో 23 రోజుల్లో 303కి.మీ, కడప జిల్లాలో 16 రోజుల్లో 200కి.మీ మేర పాదయాత్ర సాగింది.

రాయలసీమలో 44 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 108 మండలాల్లో 943 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1584.1 కి.మీ. మేర పూర్తయింది. 124 రోజులపాటు రాయలసీమలో హోరెత్తించిన యువగళం పాదయాత్ర ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది.

మంగళవారం సాయంత్రం 4గంటలకు జిల్లా సరిహద్దదలోని మర్రిపాడు మండలం వద్ద కదిరినాయుడుపల్లిలో నారా లోకేష్‌ ప్రవేశిస్తారు. ఇంకా అధికారికంగా టిడిపిలోకి చేరకపోయినప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర బాధ్యతలు చేపట్టిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారధ్యంలో పాదయాత్ర సన్నాహాలు చేస్తున్నారు.

నియోజకవర్గ బాధ్యులు ఆనం, జిల్లా నాయకులు, కార్యకర్తలు నారా లోకే్‌షకు ఘనస్వాగతం పలకడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. తొలిరోజున సుమారు 7 కి.మీ నడిచి పడమటి నాయుడుపల్లికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేయనున్నారు.

14వ తేదీ బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు పడమటి నాయుడుపల్లి క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. చుంచులూరు వద్ద పాదయాత్ర 1600 కి.మీ పూర్తయిన సందర్భంగా మైలురాయి స్థూపాన్ని నారా లోకేష్‌ ఆవిష్కరిస్తారు.

పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను నెల్లూరు-కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆనం రామనారాయణరెడ్డి, రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బుల్లెట్‌ రమణ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా వేలాదిమంది నాయకులు, కార్యక్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు తరలివచ్చి లోకేష్‌ పాదయాత్రకు సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా ఆనం పిలుపునిచ్చారు.

మంగళవారం రాత్రి అనంతపురం ఎస్సీ కాలనీ వద్ద లోకేష్‌ బస చేసే ప్రదేశాన్ని, పాదయాత్ర 1600 కి.మీ మైలురాయి దాటుతున్న సందర్భంగా చుంచులూరులో లోకేష్‌ ఆవిష్కరించనున్న శిలఫలకం వద్ద పనులను వారు పరిశీలించారు. లోకేష్‌ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గాల్లో సాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.

ఆత్మకూరు నుంచి మొదలయ్యే పాదయాత్ర వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల మీదుగా ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles