వైసిపి నుండి సస్పెన్షన్ కు గురైన నెల్లూరులో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. మరో రెండు రోజులలో నెల్లూరు జిల్లాలో ప్రవేశించనున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రవేశించడమే కాకుండా, దానిని విజయవంతం చేసేందుకు తమ వంతు పాత్ర వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వేంకటగిరి ఎమ్యెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కలిసి, టిడిపిలో చేరేందుకు తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై తొందరపడొద్దని, పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించి, ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలుస్తున్నది.
నెల్లూరు రూరల్ ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టిడిపి నేతలు స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఎప్పటి నుండో సుముఖంగా ఉన్నారు. ఇక, ఉదయగిరి ఎమ్యెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా బద్వేల్ లో పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ను కలిసి వచ్చారు. వీరు ముగ్గురు కూడా ఎమ్యెల్యేలుగా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా, టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది.
మరోవంక, వీరు ముగ్గురు లోకేష్ పాదయాత్రలో పాల్గొనగానే వారిని అనర్హులుగా ప్రకటించి, ఉపఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. సాధారణ ఎన్నికల ముందు ఉపఎన్నికలు జరిగితే, ఆ మూడింటిని వైసీపీ గెల్చుకొంటే నైతికంగా టిడిపిని దెబ్బకొట్టిన్నట్లు కాగలదని అంచనా వేస్తున్నారు.
ఉపఎన్నికలు జరిగితే అవి ఎన్నికల ముందు ప్రజల నాడి తెలుసుకొనేందుకు వైసీపీ – టిడిపిలకు బలపరిక్షగా మారే అవకాశం ఉంది. అయితే మూడు సీట్లు గెలుచుకుంటామనే ధీమా పనికిరాదని కొందరు వైసీపీ నేతలు సహితం వారిస్తున్నట్లు తెలుస్తున్నది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉండడం, అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరడంతో ఉప ఎన్నికలు సవాల్ గా పరిణమించే అవకాశం ఉంది.
లోకేష్ పాదయాత్రలో పాల్గొనే సమయంలో వీరు ముగ్గురు ఎమ్యెల్యేలుగా రాజీనామా చేస్తే ఆటోమేటిక్ గా ఉపఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది. అయితే, ఇంకా సాంకేతికంగా వైసీపీ ఎమ్యెల్యేలుగా ఉంటూ టిడిపి పాదయాత్రలో పాల్గొంటే వారిపై స్పీకర్ అనర్హత చర్యలకు పాల్పడవలసి ఉంటుంది. ఈ విషయంలో కొన్ని సాంకేతిక, న్యాయపరమైన ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
ఏదేమైనా ఎమ్యెల్యే పదవులకు రాజీనామా చేయకుండా వారు టిడిపి పాదయాత్రలో పాల్గొంటే తీవ్రమైన చర్యలకు పాల్పడాల్సి ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యవసానాలు సిద్దపడే వీరు ముగ్గురు ముందడుగు వేసే అవకాశం ఉంది. అయితే, ఈ ముగ్గురు వ్యూహాత్మకంగా పసుపు జెండాలు పెట్టుకోకుండా, పాదయాత్రలో పాల్గొనడం ద్వారా సాంకేతికంగా తాము టిడిపి సభ్యులం కాదని అంటూ వాదనకు దిగే అవకాశం లేకపోలేదు.
లోకేష్ పాదయాత్ర తర్వాత టిడిపిలో చేరబోతున్నట్లు ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. దానితో రెండు పార్టీలలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా నెల్లూరు రాజకీయ పరిణామాలు మొత్తం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వచ్చే ఎన్నికలలో నెల్లూరు నుండి గాని, నెల్లూరు లోక్ సభకు గాని పోటీచేయాలి అనుకుంటున్న ఆనం రామనారాయణ రెడ్డి ఉప ఎన్నికల్లో వేంకటగిరి నుండి పోటీచేస్తారా అన్నది అనుమానాస్పదమే. పైగా, మరో మూడు, నాలుగు నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పుడు ఉపఎన్నికలకు ఎన్నికల కమిషన్ సుముఖంగా ఉంటుందా? అనే ప్రశ్న సహితం తలెత్తుతుంది.