`మోస్ట్ అవినీతి పార్టీ వైసీపీ’ అంటే బిజెపికి ఓట్లు రాలతాయా!

Thursday, September 19, 2024

బహుశా మొదటిసారిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీపై, ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేతలు పూర్తి స్థాయిలో ధ్వజమెత్తడం ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ `దేశంలో మోస్ట్ అవినీతి పార్టీ వైసీపీ’  అంటూ బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా మండిపడ్డారు.  నాలుగేళ్లుగా ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. దేశంలో శాంతి‌ భద్రతలను గాలికి వదిలేసిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంత దారుణంగా మారడంలో కేంద్రంలోని బిజెపి పెద్దల పాత్ర లేదా? వారందిస్తున్న సహకారం లేదా? ఇప్పుడు మరో తొమ్మిది, పది నెలల్లో ఎన్నికలు రావడానికి ముందు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని ఇంతగా విమర్శలు గుప్పిస్తుంటే జనం నమ్ముతారా? ఒక విధంగా నడ్డా విమర్శలు బిజెపి విశ్వసనీయతనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ల్యాండ్‌ స్కామ్‌, లిక్కర్‌ స్కామ్‌ జరుగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనను పూర్తి గాలికి వదిలేసిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడం పోవడం వల్లే పనులన్నీ నిలిచిపోయాయని నడ్డా విమర్శించారు.

వైసీపీ చేతకాని తనం, జగన్ వైఫల్యం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా రాజధానిలో పనులు జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని జేపీ నడ్డా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా సీఎం జగన్ అమరావతి రాజధానిని ఎడారిగా మార్చే ప్రయత్నం చేయగలరా?

అమరావతిని జగన్ అభివృద్ధి చేయడంలేదని విమర్శలు గుప్పిస్తున్న నడ్డా అక్కడ ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలనైనా ఇప్పటివరకు నిర్మించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు?  సమాధానం చెప్పగలరా? రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నేడు నిలబడడానికి జగన్ తో పాటు బిజెపి పాత్ర లేదా?

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఉద్యమాలు చేపట్టిన కొత్తలో రాష్ట్ర బిజెపి నేతలు కొందరు ఏ విధంగా ఎద్దేవా చేశారో రాష్ట్ర ప్రజలు మర్చిపోగలరా?  కేంద్రంలో ప్రధాని మోదీ అవినీతి లేని పాలన అందిస్తున్నారని నడ్డా చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ అవినీతి కేసులలో బెయిల్ పై ఉంటూ ముఖ్యమంత్రి కావడం, ఎనిమిదేళ్లు అవుతున్నా ఆ కేసులు కోర్టులో ముందుగా సాగకపోవడం, కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రేక్షక పాత్ర వహించడం .. ఇదంతా బీజేపీ ప్రభుత్వ అండదండలు లేకుండా జరుగుతున్నాయా?

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని అంటున్న నడ్డాకు వైఎస్ వివేకానందరెడ్డి కేసులో దర్యాప్తు సక్రమంగా సాగకుండా సిబిఐకి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్న విషయం తెలియదా? సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంటే గాని ఈ కేసులో సీబీఐ అడుగులు వేయలేని దుస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఒక ఎంపీని అరెస్ట్ చేసేందుకు ఎందుకని నిస్సహాయంగా నిలబడాల్సి వస్తున్నది?

నాలుగేళ్లుగా మోదీ – జగన్ ప్రభుత్వాలు భుజం, భుజం రాసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ఏపీ ప్రజల భవిష్యత్ ను రాద్ధాంతం చేస్తుండటాన్ని ప్రజలు మరచిపోతారా? తమ ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజలలో పేరుకుపోతున్న ఆగ్రవేశాలు ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిధ్వనించడంతో, జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టడం ద్వారా కొంత సానుకూలత ఏర్పర్చుకొనే ప్రయత్నం నడ్డా చేసినట్లు స్పష్టం అవుతుంది.

పైగా, రెండు పార్టీలు రాజకీయంగా ఎంతగా అవగాహనతో నడుస్తున్నా, ఎన్నికల సమయంలో బిజెపితో చేతులు కలిపితే ఎస్సి, మైనారిటీల ఓట్లు దూరం అవుతాయనే భయం వైఎస్ జగన్ కు ఉంది. అందుకనే జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా ఆయా వర్గాలలో ఆ పార్టీ పలుకుబడిని సుస్థిరం చేసే ప్రయత్నం కూడా నడ్డా చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles