చంద్రబాబు నాయుడు ప్రముఖమైన నాయకుడు అవును కాదు దేశ ప్రజలకు తెలుసు. ఆయన ఇవాళ ప్రతిపక్షంలో ఉండవచ్చు గాక… అంతమాత్రాన ఆయన ప్రాధాన్యం ఏమిటో ఆయనకు ఎలాంటి భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నదో దేశాన్ని ఏలే ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు. ఆయనకున్న భద్రత గురించి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మధనపడిపోతున్నారు? చంద్రబాబు గురించి వారికి ఏడుపు ఎందుకు? జెడ్ కేటగిరి భద్రతను తొలగించాలని వారు ఎందుకు గోల చేస్తున్నారో అర్థం కావడం లేదు.
చంద్రబాబు నాయుడుకి జడ్ క్యాటగిరి భద్రతను తక్షణం తొలగించాల్సిందిగా కోరుతూ తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఇటీవల ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సెలవిచ్చారు. జెడ్ కేటగిరి భద్రత లేకపోతే ఆయన చిటికెలో ఫినిష్ అయిపోతారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. జెడ్ కేటగిరి భద్రత ఉండడం వల్లనే ఆయనను ఫినిష్ చేయలేకపోతున్నామని ఆయన బాధపడుతున్నారో ఏమిటో తెలియదు. తాను చెప్పినట్లుగా కేంద్రానికి లేఖ రాశారో లేదో కూడా తెలియదు.
అయితే ఇప్పుడు ఉపసభాపతి వంతు వచ్చింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చంద్రబాబు నాయుడుకి జెడ్ కేటగిరి భద్రత అవసరం లేదని చెబుతున్నారు. ఎప్పుడో ఆయన మీద నక్సలైట్ల దాడి జరిగిందని ఇప్పుడు ఆయనకు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ గారు సెలవిస్తున్నారు. జెడ్ కేటగిరి భద్రతను తొలగించాల్సిందిగా రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల అభిప్రాయపడుతున్నారని కూడా కోలగట్ల తీర్మానం చేసేశారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలందరూ ఆయనకు చెవిలో చెప్పారో ఏమో మనకు తెలియదు.
వైసిపి నాయకులందరూ కూడా ఇలా చంద్రబాబు నాయుడు భద్రత గురించి విలపిస్తున్నారు ఎందుకు? ఆయనకు ఏ స్థాయి భద్రత ఉంటే ఏమైంది? వచ్చిన నష్టం ఏమిటి.. ఇది ప్రజలకు కలుగుతున్న సందేహం.
జెడ్ కేటగిరి భద్రత లేకుండా రాష్ట్ర పోలీసుల రక్షణ వలయంలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లయితే గనుక ఆయనను తమ ఇష్టానుసారం ఆడించవచ్చునని అధికార పార్టీ భావిస్తున్నదా? చంద్రబాబు నాయుడు కదలికలను ఎప్పటికప్పుడు తమ రాష్ట్ర పోలీసుల నిఘా ద్వారా తెలుసుకుంటూ ఉండవచ్చునని వారు అనుకుంటున్నారా అనేది బోధపడటం లేదు. అయినప్పటికీ దేశంలోని సీనియర్ ప్రముఖ నాయకులలో ఒకరైన చంద్రబాబు నాయుడుకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రత గురించి ఆయన ప్రత్యర్థి పార్టీ ఇలాంటి గోల చేయడం చాలా చవకబారుగా ఉంది. చంద్రబాబు జెడ్ కేటగిరీని చూసి విలపించే ముందు, తమ సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసిన వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రాన్ని అడిగి తెచ్చుకున్న వై క్యాటగిరి భద్రత గురించి వారు ఆలోచించుకోవడం మంచిది.
చంద్రబాబు భద్రతపై వీళ్లకు ఎందుకంత నొప్పి?
Monday, December 23, 2024