నిజామాబాద్ ఎంపీ సీటుపై గురితో రెచ్చిపోతున్న కవిత

Monday, December 23, 2024

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో  కాంగ్రెస్ లో జోష్ పెరగడంతో అందరికన్నా ఎక్కువగా బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవితలో కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నది.  ప్రస్తుత పరిస్థితులలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తనను అరెస్ట్ చేసే సాహసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయకపోవచ్చనే సంకేతాలు వెల్లడి కావడంతో ఆమె కొద్దీ రోజులుగా రాజకీయం ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

ఈ కుంభకోణంలో ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చనే కధనాల మధ్య సుమారు రెండు రోజులుగా ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే  ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆమె గత ఎన్నికలలో ఓటమి చెందిన నిజామాబాదు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉధృతంగా పర్యటనలు జరుపుతూ కాంగ్రెస్, బిజెపిలకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.

అంటే, ఆమె తిరిగి అక్కడి నుండి లోక్ సభకు పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చినట్లయింది. గత ఎన్నికల్లో తనను ఓడించిన బిజెపి ఎంపీ డి అరవింద్ ప్రాబల్యం ప్రస్తుతం తగ్గుతున్నట్లు కనిపిస్తుండడంతో సునాయాణంగా గెలుపొందగలదనే భరోసా ఆమెలో వ్యక్తం అవుతున్నది.

సమైక్య రాష్ట్రంలో, సమైక్య పాలనలో కరువు ఉండేదని నేడు ఎక్కడ చూసినా పచ్చని పైర్లు కనిపిస్తున్నాయని అంటూ తండ్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనా గురించి ఘనంగా చెప్పుకొస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యామ్లు, రిజర్వాయర్లు అని సరికొత్త నిర్వచనం ఇచ్చారు.

అతి తక్కువ కాలంలో రాష్ట్ర గతిని మార్చే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర రావు అని పిలవాలని కవిత కోరారు. కాంగ్రెస్ పాలనలో కాలువలు కట్టకుండానే వేల కోట్లు దండుకున్నారని విమర్శలు కురిపిస్తున్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నార‌ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని ఆమె సవాల్ విసిరారు.

ఇక కాషాయ కండువా కప్పుకున్న వాళ్లు జైజవాన్, జైకిసాన్ అంటుంటే.. డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లుందని ఆమె మోదీ పాలనను ధ్వజమెత్తారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని ఆమె తెలిపారు.

మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం అమృత్ సరోవర్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమం విఫలమైందని, ఆ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో దేశంలో చెరువులు బాగవ్వడం లేదని కవిత విమర్శించారు.

బిజెపి  సర్కార్ జవాన్, కిసాన్ లకు చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకున్నారని పేర్కొంటూ నిజమైన దేశ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ మాత్రమేనని కవిత పేర్కొన్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్, బిజెపిలకు స్థానంలేదని చెబుతూ ఇతర పార్టీల కార్యకర్తలు కూడా గులాబీ కండువా కప్పుకోవాలని. నిజామాబాద్ జిల్లాలో వేరే పార్టీకి ఆస్కారం ఉండకూడదని కవిత పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles