పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ కడపలో మిషన్ రాయలసీమ పేరుతో రాయల సీమ సమస్యల గురించి, ఆ ప్రాంత బాగుకోసం ప్రభుత్వాలు పూనిక వహించాల్సిన అవసరం గురించి, ఆ ప్రాంత వనరుల గురించి నిర్వహించిన ఒక చర్చావేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు అనేక వరాలు గుప్పించారు. పారిశ్రామికీకరణ పరంగా అనేక ప్రాజెక్టులు తీసుకురావడం గురించి హామీ ఇచ్చారు. హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం గురించి చెప్పారు. నిజానికి రాయలసీమకు తమ ప్రభుత్వం ఏం చేయగలదో లోకేష్ చెప్పిన వాటిలో కనీసం సగం చేసినా సరే.. ఆ ప్రాంతం మళ్లీ రతనాల సీమగా మారిపోతుందని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.
లోకేష్ మాటలతో అధికార పార్టీలో కంగారు పుట్టడం సహజం. చంద్రబాబునాయుడే ఈ రాష్ట్రానికి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా.. అప్పుడు చేయలేనిది ఇప్పుడు చేస్తానని చెప్పడం ఏమిటి? అనే ప్రశ్నలు చాలా సహజంగానే వస్తున్నాయి. అయితే అందుకు కూడా సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే.. పారిశ్రామిక విప్లవం పరంగా.. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు రవాణా సదుపాయాలు వేరు. పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలకంటె ముందు ఇలాంటి వసతులను గమనించుకుంటాయి. అందుకే చంద్రబాబు తన పాలన కాలంలో రోడ్ల నిర్మాణం మీద అంత శ్రద్ధగా ఉండేవాళ్లు. దాని ఫలితమే అంతో ఇంతో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికీకరణ కూడా. ఏపీలో ఇప్పుడు తీరం పొడవునా కొత్త పోర్టులు కూడా రావడంతో, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. అయితే జగన్ సర్కారు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. ఒక్క కొత్త పరిశ్రమం అనేదే లేకుండా పోయింది. రాయలసీమ పరిశ్రమలకు ఎంతో అనువైన ప్రాంతం కావడంతో లోకేష్ అదే హామీని తారకమంత్రంగా అక్కడ ప్రయోగించారు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు రాయలసీమను కేరాఫ్ అడ్రస్ గా మారుస్తామని, ఫైనల్ ప్రాడక్ట్ తయారీ వరకు ఇక్కడే జరిగేలా పరిశ్రమలను నెలకొల్పుతామని లోకేష్ చెప్పారు. అలాగే హార్టికల్చర్ పరంగా కూడా సీమను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్తాం అని అన్నారు.
లోకేష్ చెప్పిన వాటిలో భారతదేశానికే స్పోర్ట్స్ కేపిటల్ గా తయారుచేస్తాం.. రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తాం లాంటివి మాత్రం కొంచెం ప్రాక్టికాలిటీకి దూరంగా ఉన్నాయి. కనీసం ఆ ప్రాంతంనుంచి వివిధ క్రీడల్లో కొందరైనా దేశంలో పేరుమోసిన క్రీడాకారులు ఉంటే అలాటి హామీ ఆ ప్రాంతానికి నప్పేది! అదేం లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతాం అనడం అతిశయోక్తిగా ఉంది. దానిని పక్కన పెట్టినా సరే.. పరిశ్రమలు, హార్టికల్చర్ పరంగా.. ఇటీవలి కాలంలో మారిన నేపథ్యాలు, పరిస్థితులు, వనరులు వేరు కాబట్టి.. లోకేష్ చెప్పినంతలో కనీసం సగం వరకు నెరవేరినా కూడా రాయలసీమ మళ్లీ రతనాల సీమగా పేరుమోస్తుందనడంలో సందేహం లేదు.
లోకేష్ అన్నంత చేస్తే మళ్లీ రతనాల సీమే!
Saturday, November 16, 2024