సుమారు ఐదేళ్ల తర్వాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డలతో గత శనివారం రాత్రి ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కలిసి, సుమారు గంట సేపు చర్చలు జరపడం రాజకీయ వర్గాలలో మిస్టరీగా మారింది. ఆ భేటీలో వారేమీ చర్చించారో అన్న విషయమై అటు బీజేపీ వర్గాలు గాని, ఇటు టిడిపి వర్గాలు గాని ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు.
కేవలం వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ- బీజేపీ మధ్య పొత్తు కోసమే వారు భేటీ అయ్యారని అంటూ ఏపీలో బిజెపికి టిడిపి వదిలిన లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలంటూ సోషల్ మీడియాలో ఒక జాబితా విస్తృతంగా వైరల్ అయింది. పోటీ చేయబోయే బిజెపి అభ్యర్థుల పేర్లు కూడా అందులో ఉన్నాయి. అయితే ఈ భేటీ గురించి చంద్రబాబు టిడిపి నేతల ముందు కూడా ఏమీ చెప్పలేదని తెలుస్తున్నది.
మరోవంక, టిడిపితో పొత్తు లేదంటూ తెలంగాణ బిజెపి నేతలు బండి సంజయ్, ఎన్ ఇంద్రసేనారెడ్డి మీడియా ముందు కస్సుమనడంతో మంగళవారం ఉదయం జరిగిన టెలి-కాన్ఫరెన్స్ లో కొందరు టిడిపి నేతలు ఈ విషయమై ప్రస్తావించారని తెలిసింది. అందుకు సమాధానంగా, రెండు పార్టీల మధ్య పొత్తు ప్రస్తావన ఇప్పటివరకు ఎక్కడా రాలేదని, ఈ విషయమై ఎవ్వరో ఏమీ మాట్లాడవద్దని చంద్రబాబు స్పష్టం చేశారని చెబుతున్నారు.
పైగా, తాను కేసుల గురించి అమిత్ షా వద్దకు వెళ్లలేదని అంటూ పరోక్షంగా సీఎం జగన్ పై చురకలు అంటించారు. టిడిపి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర రెడ్డి సహితం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా ను తెలుగు ప్రజల కోసమే కలిసారని చెప్పారు. పైగా, రాజకీయాలకోసం, కేసుల కోసం కాదని పేర్కొనడం గమనార్హం.
మరోవంక, ఈ భేటీ గురించి బిజెపితో సన్నిహితంగా ఉంటున్న వైసిపి వర్గాలు సహితం ఆందోళన చెందుతున్నాయి. నాలుగు నెలలుగా చంద్రబాబు ఇటువంటి భేటీ కోసం ప్రయత్నం చేస్తున్నా ఢిల్లీ నుండి సానుకూల స్పందన రావడం లేదు. అయితే అకస్మాత్తుగా ఆయనను భేటీకోసం ఆహ్వానించడం వెనుక బలమైన రాజకీయ కారణం ఏమై ఉంటుందా అని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.
పైగా, ఈ భేటీ గురించి చివరి వరకు రహస్యంగా ఉంచారు. చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరడానికి కొద్దిసేపు ముందే టిడిపి వర్గాలు మీడియాకు తెలిపాయి. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఆ రోజున ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరగడంతో ప్రధాని అక్కడకు వెళ్లారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఆందోళనలు, హడావుడిగా ఉంది.
అయినప్పటికీ కీలకమైన హోమ్ శాఖ నిర్వహిస్తున్న అమిత్ షా ఈ భేటీని కొనసాగించడం పట్ల పలు వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పైగా, ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా పాల్గొనడంతో కేవలం రాజకీయ అంశాలను మాత్రమే ప్రస్తావనకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.
జి 20 సదస్సుకు సంబంధించి, 2047 – అమృత కాల్ విజన్ పత్రం వంటి అంశాల గురించి అంత హడావుడిగా భేటీ జరగాల్సిన అవసరం లేదని స్పష్టం అవుతుంది. ఈ భేటీ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలోని బిజెపి నాయకులకు సహితం ఎటువంటి సమాచారం లేదని తెలుస్తున్నది. పైగా, ఈ భేటీకి సంబంధించి ఎటువంటి ఫోటోలను రెండు వైపులా బైటకు విడుదల చేయలేదు.
గత నెల రోజుల నుండే కేంద్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రభుత్వానికి ఆర్ధిక వనరుల విషయంలో, సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే ప్రయత్నం చేసే విషయంలోనే ఎంతో అండగా నిలబడుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తద్వారా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తిరిగి జగన్ గెలుపొందాలని బలంగా కోరుకొంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ఇటువంటి పరిస్థితులలో టీడీపీ – బీజేపీ మధ్య పొత్తుల విషయమై చర్చించేందుకు రెండు పార్టీలు సుముఖంగా లేవు. పొత్తులు పెట్టుకున్నా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఓట్ల మార్పిడి అంత తేలికైన విషయం కాదు. ఇటువంటి పరిస్థితులలో అమిత్ షా- చంద్రబాబుల మధ్య భేటీ జరగడం, దీని విషయమై ఇరువురు మౌనంగా ఉండటం సహజంగానే రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది.