తెతెదేపాకు కొత్త ఊపిరులూదుతున్న చంద్రబాబు

Monday, December 23, 2024

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. తెలంగాణలో సైతం తమ పార్టీకి కొత్త జవజీవాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవలి మహానాడులో మరోసారి ఎన్నికైన తర్వాత.. తొలిసారిగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబునాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్కారం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒకప్పటి పూర్వవైభవాన్ని ఖచ్చితంగా సంతరించుకుంటుందని చంద్రబాబు కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
తెలంగాణ ప్రాంతం ఒకప్పట్లో తెలుగుదేశానికి బలమైన ప్రాంతంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత కూడా.. తెలుగుదేశానికి గణనీయంగానే సీట్లు దక్కాయి. అయితే కేసీఆర్ ఎత్తుగడలు, ఫిరాయింపు రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం నాయకత్వం పరంగా దారుణంగా దెబ్బతింది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు అంతా గులాబీ తీర్థం పుచ్చుకుని పార్టీని వదిలేశారు. నాయకుల లేమి కనిపించింది గానీ.. క్షేత్రస్థాయి కార్యకర్తల్లో, అభిమానుల్లో, ఓటు బ్యాంకులో తెదేపా స్థిరంగానే ఉన్నదని, పూర్తిగా దెబ్బతినిపోలేదని పలువురు భావిస్తుంటారు.
సరిగ్గా ఈ బలాన్ని చూసుకునే భాజపా కూడా.. తెలుగుదేశంతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని ఉత్సాహపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెదేపాకు క్షేత్రస్థాయిలో ఉన్న బలం తోడైతే బిజెపి అధికారంలోకి రాగలదని వారు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు కూడా ఆ పొత్తులకు సుముఖంగానే ఉన్నారు. కమలదళంతో పొత్తుల గురించి ప్రచారం మొదలైన తర్వాత.. తెలంగాణలోని సామాన్య కార్యకర్తలు కాస్త ఉత్సాహంగానే ఉన్నారు. పార్టీ మళ్లీ సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతుందని అనుకుంటున్నారు.
మొన్నమొన్నటిదాకా తెలంగాణ తెలుగుదేశం నీరసంగా ఉన్నప్పటికీ కాసాని జ్ఞానేశ్వర్ సారధిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాస్త ఊపు తీసుకువచ్చారు. రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో ఓ భారీ బహిరంగ సభ కూడా జరిగింది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. మొత్తానికి తెలుగుదేశం తరఫున పోటీచేయడానికి ఎవరైనా ఉత్సాహం చూపించే వాతావరణం తీసుకువస్తున్నారు. ఇది ఆదిగా.. తెలుగుదేశం చంద్రబాబునాయుడు అన్నట్లుగా ఒకప్పటి పూర్వవైభవాన్ని నెమ్మదిగానైనా సాధిస్తుందని, కమలదళంతో పొత్తు కుదిరితే ఇంకాస్త తొందరగా కూడా వీలవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles