జగన్ శాసనసభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లబోతున్నారనే వార్త ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో దావానలంలా వ్యాపిస్తోంది. అనేక కారణాల నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి 7వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలోగానీ, లేదా, మరో నెల రోజుల వ్యవధిలోగానీ శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకుంటానే వాదన సర్వత్రా ప్రచారంలో ఉంది. ప్రజల్లో నానుతోంది. ఈ విషయంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి వైసీపీ పెద్దలు నానా పాట్లు పడుతున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందస్తుకు సంబంధించిన వార్తలను ఖండించారు.
తమ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని, పార్లమెంటుతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లవలసిన అవసరం తమ పార్టీకి ఎంతమాత్రమూ లేదని పెద్దిరెడ్డి ప్రకటించారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ‘అవునంటే కాదనిలే’ అనే సినిమా పాట చందంగా.. పెద్దిరెడ్డి కాదంటే.. వాస్తవంలో అవుననిలే అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వ నిర్వహణ, సంక్షేమ పథకాలకు ప్రతినెలా వేల కోట్ల రూపాయల అప్పులు పుట్టించి.. ప్రజల ఖాతాల్లోకి జమచేయడం వంటి పనులు జగన్ కు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఇప్పటిదాకా ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తున్నప్పటికీ.. రెండు మూడు నెలల కంటె ఎక్కువ కాలం అలా కుదరదని కొందరు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వోద్యోగుల జీతాలు ఒకటో తేదీనే వచ్చేస్తాయి అనే సంగతినే వారంతా మర్చిపోయారు. ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవడమే అన్నట్టుగా ప్రిపేర్ అయిపోయారు. కేవలం ఆర్థిక వనరుల లేమి ప్రభుత్వాన్ని సతమతం చేసేస్తోంది.
ఈ ఇబ్బందులు విశ్వరూపం దాల్చి సంక్షేమ పథకాలు ఒకటీ అరా ఆగినా కూడా.. ఇన్నాళ్లు పంచిపెట్టిన శ్రమ నిష్పలం అవుతుందని జగన్ భయపడుతున్నారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని, ఆర్థిక లోటు ప్రభుత్వాన్ని కుదేలు చేయకముందే ఎన్నికలకు వెళ్లిపోతే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇక ఎన్ని రకాల కొత్త నాటకాలకైనా తెరతీయవచ్చునని జగన్ అనుకుంటున్నారు.
తెలుగుదేశం- జనసేన- బిజెపి మధ్య పొత్తులు కొలిక్కి రాకముందే ముందస్తుకు వెళ్లాలని లేకపోతే ఆ కూటమి బలపడుతుందని జగన్ ఒకవైపు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో.. ముందస్తుకు వెళ్లడం అనేది తనలోని భయానికి సంకేతంగా ప్రజలు భావిస్తారా? అని కూడా మధనపడుతున్నారు. పథకాలు కాస్త అటూ ఇటూ అయితే ఇంకా పెద్ద నష్టం తప్పదనుకుంటున్నారు. అభివృద్ధి కోరుకునే ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. అలాంటిది వారిలోని వ్యతిరేకత ఇంకా ప్రబలక ముందే ఎన్నికలకు వెళ్తే లాభం అని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
ముందస్తుపై మల్లగుల్లాలు పడుతున్న జగన్!
Tuesday, November 5, 2024