‘‘రీజనల్ పార్టీలతో పొత్తులు పెట్టుకునేప్పుడు రాష్ట్ర పార్టీదే తుది నిర్ణయం. బిజెపికి- తెలుగుదేశానికి మధ్య పొత్తు ఉండబోదు అనే విషయంలో మా పార్టీ రాష్ట్ర నాయకులకు పూర్తి క్లారిటీ ఉంది..’’ తెలంగాణరాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ మాటలు మరెవ్వరివో కాదు.. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డివి. ఒకవైపు బిజెపి రాష్ట్రసారధి బండి సంజయ్ తెదేపాతో పొత్తుల గురించి వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేసిన నేపథ్యంలో మరో కమల నాయకుడు.. పొత్తుల విషయంలో అసలు అధిష్ఠానానికి ఏం సీన్లేదని తేల్చేయడం తమాషాగా ఉంది.
సాధారణంగా భారతీయ జనతా పార్టీలో అధిష్ఠానం మాటే ఫైనల్. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా దారుణంగా హైకమాండ్ మాటను ఆ పార్టీ దేశమంతా కూడా శిరసావహిస్తున్న సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు బిజెపి కూడా తెదేపాతో పొత్తులు కుదుర్చుకుంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటికీ.. రాష్ట్ర కమలనాయకులు ఆ విషయంలో నోరు మెదపడం లేదు. జగన్ సర్కారు మీద పోరాడడమే తమ పని అని.. పొత్తుల సంగతి అధిష్ఠానం తేలుస్తుందని తప్పించుకుంటున్నారు.
అలాంటి సమయంలో తెలంగాణలో.. ఎన్నికల్లో ప్రజలను మెప్పించి గెలవడం ఎప్పుడో మర్చిపోయిన నల్లు ఇంద్రసేనారెడ్డి లాంటి నాయకులు.. అధిష్ఠానానికి అసలు సంబంధం లేదు. పొత్తులను రాష్ట్ర పార్టీ డిసైడ్ చేస్తుందనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరాలని, తద్వారా, కన్నడ ఓటమి ద్వారా.. శూన్యమైపోయిన తమ పార్టీ దక్షిణాది అస్తిత్వాన్ని తిరిగి తెలంగాణ రూపంలో కాపాడుకోవాలని కమలదళం కలలు కంటోంది. అయితే అందుకు సరిపడా బలం తమకు సొంతంగా లేదనే క్లారిటీ కూడా వారికి ఉంది. అందుకోసమే అమిత్ షా ప్రత్యేకంగా చంద్రబాబునాయుడుతో సమావేశం అయ్యారుకూడా.
తెలంగాణలో తెలుగుదేశం కూడా నాయకత్వం పరంగా బలహీనంగా ఉన్న నేపథ్యం, ఏపీలో జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే కోరికల కారణంగా.. చంద్రబాబునాయుడు ఈ పొత్తులకు సుముఖంగానే ఉన్నారు. కానీ తమ తమ సొంత ఎజెండాలు కలిగి ఉండే బిజెపి నాయకులు.. ఈ పొత్తులకు విముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వీరి పుల్లవిరుపు మాటల వలన, రాష్ట్రంలో పార్టీ దెబ్బతిన్నా కూడా ఆశ్చర్యం లేదని కొందరంటున్నారు. తెదేపాతో పొత్తు విషయంలో తెలంగాణ బిజెపిలో రెండు వర్గాలుగా రెండు వాదనలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.
పొత్తులపై అధిష్ఠానానికి సీన్లేదంటున్న కమలనేత!
Monday, November 25, 2024