బిజెపి నుండి వైదొలగమని ఈటెలపై పెరుగుతున్న వత్తిడి!

Friday, December 20, 2024

తెలంగాణ బీజేపీలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ కు ఇప్పటిలో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే ప్రసక్తి లేదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఈటెలతో పాటు ఇతర పార్టీల నుండి వచ్చిన పలువురు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నంతవరకు తెలంగాణాలో బిజెపి ముందుకు దూసుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అయిన కూడా వారెవ్వరిని ఖాతరు చేయడం లేదు.

ఈ పరిణామాలే బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురై బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను వెనుకడుగు వేసేటట్లు చేశాయి. ముఖ్యంగా కర్ణాటక ఫలితాల అనంతరం ఇక తెలంగాణాలో బిజెపికి భవిష్యత్ లేదనే నిర్ధారణకు వచ్చారు. వారిద్దరిని బిజెపిలోకి తీసుకు వెళ్లాలని తానెంతో కృషి చేశానని, కానీ వారే తనకు `రివర్స్ ఆఫర్’ ఇస్తున్నారని ఈటెల పేర్కొనడం గమనార్హం.

ఈటెల బిజెపి నుండి వైదొలిగి, బైటకు వస్తే అంత కలిసి ఒక పార్టీగా ఏర్పడి, తెలంగాణాలో తమ సత్తా చూపించవచ్చని ప్రతిపాదిస్తున్నారు. ఈటెల వస్తే మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిలతో పాటు పలువురు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.

ఈ సందర్భంగా భువనగిరిలో బిజెపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన `తెలంగాణ ఉద్యమకారుల అలయ్-బలమ్’ `అసంతృతుల వేదిక’గా మారింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈటెలతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్,  మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే నగేశ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, రాణి రుద్రమ, ఏపూరి సోమన్న, బండ్రు శోభారాణి వంటి వారు పాల్గొన్నారు.

గత ఏడాది తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తితో దూరంగా ఉంటున్నారు. బండి సంజయ్ వంటి నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. తెలంగాణ ప్రజలారా.. ఉద్యమకారులారా.. కళాకారులారా.. మేధావులారా.. మళ్ళీ మనందరం మరొక ఉద్యమం చేయాలని ఈటెల పిలుపివ్వడం గమనార్హం.  తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా తెలంగాణ గడ్డ ఉందని చెబుతూ  తుఫాను తాకిడికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు.

అయితే, బిజెపి నేడు బిఆర్ఎస్ ను ఓడించే పరిస్థితుల్లో లేదని భావిస్తున్న రాజేందర్, ఆ పార్టీని వదిలి వచ్చేందుకు కూడా సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకనే పొంగులేటి, జూపల్లి, ఇతర నేతలు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు విజయవంతమైతే సొంతంగా పార్టీ పెట్టుకొని, 30 నుండి 40 సీట్లపై దృష్టి సారించి, కనీసం 20 మంది ఎమ్యెల్యేలను గెలిపించుకోగలిగితే తర్వాతి ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ కావచ్చని భావిస్తున్నారు.  కోదండరాం సహితం వీరితో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చారు.

ఈటెల బిజెపిని వదిలేందుకు ఇష్టపడకపోతే ఇక కాంగ్రెస్ లో చేరడం మినహా మరో మార్గం ఉండబోదని పొంగులేటి, జూపల్లి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వం వారిద్దర్నీ సంప్రదించింది. పార్టీలో తగు ప్రాధాన్యత ఇస్తామని భరోసా కూడా ఇచ్చింది. అయితే, ఇప్పటికే కుమ్ములాటలతో నిండిపోయిన కాంగ్రెస్ లో ఏమేరకు సర్దుబాటు చేసుకోగలమో అనే సంశయంతో వారింకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక పోతున్నారు.

గత నెలలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన ఈటెల రాజేందర్ తెలంగాణాలో పార్టీ వ్యవహారాలపై సవివరమైన నివేదిక ఇచ్చారని తెలుస్తున్నది. కానీ ఆ నివేదికను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈటెల – బండి లమధ్య పార్టీ శ్రేణులు నలిగిపోతున్నారు. చివరకు నిజామాబాదు యంపీ డి అరవింద్ వంటి వారు కూడా పార్టీ కార్యాలయం ముఖం చూడటం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles