లోకేష్ పోస్టర్లు వైసీపీ కూసాలు కదిలించాయా?

Thursday, December 19, 2024

సాధారణంగా రాజకీయాల్లో తమ ప్రత్యర్థుల విమర్శల పట్ల స్పందించకుండా ఇగ్నోర్ చేయడం ద్వారా నాయకులు ప్రధానంగా మైండ్ గేమ్ ఆడుతుంటారు. ఈ ‘ఇగ్నోర్ చేయడం’ ఒక స్ట్రాటజీ! నువ్వు నా స్థాయి వ్యక్తి కాదు.. నీ విమర్శల పట్ల స్పందించను. నీ విమర్శలకు ప్రజల్లో విలువలేదు.. నేను స్పందించే అవసరం లేదు.. అనే తరహా సంకేతాలను ఇగ్నోర్ చేయడం ద్వారా పంపడానికి ప్రయత్నిస్తుంటారు. స్పందించారంటే మాత్రం ఆ విమర్శలను ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటున్నట్టే. ఆ విమర్శలకు జడుసుకుంటున్నట్టే. ఆ సిద్ధాంతం ప్రకారం గమనించినప్పుడు.. కడపజిల్లాలో పాదయాత్ర సందర్భంగా బాబాయిని చంపిందెవరు అని ముంద్రించిన పోస్టర్లను ప్రదర్శిస్తూ నారా లోకేష్ రెచ్చిపోవడం అనేది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూసాలను కదిలించినట్లుగా అనిపిస్తోంది.
ఎందుకంటే, ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసిన ప్రతి సందర్భంలోనూ.. ముఖ్యమంత్రి మనోగతాన్ని తన మాటల్లో వివరించే బాధ్యత తీసుకునే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా లోకేష్ పోస్టర్లు పట్టుకుని చేసిన విమర్శలపై స్పందించారు.
అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇఛ్చి ఉండొచ్చు గానీ.. సీబీఐ విచారణ జరుగుతున్న తీరుతెన్నులు పాలకపక్షానికి కంగారు పుట్టిస్తున్నాయి. చార్జిషీట్ లలో మొదటిసారిగా జగన్ పేరును ప్రస్తావించడం కూడా ఆ పార్టీకి కంగారు కలిగిస్తోంది. నిందితుడిగా సీబీఐ జగన్ పేరును చేరుస్తుందా లేదా అనే సంగతి తర్వాతి సంగతి.. కానీ.. అవినాష్ రెడ్డిని మరో రెండు విడతలు విచారించడం పూర్తయితే గనుక.. సీఎం జగన్ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉండవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిణామం అవుతుంది.
ఇలాంటి నేపథ్యంలో.. మీడియా ముందుకు వచ్చిన సజ్జల యథావిధిగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి కొన్ని విమర్శలు చేసేసి.. ఆ తర్వాత తన ఉక్రోషాన్నంతా లోకేష్ మీదకు మళ్లించారు. పోస్టరు పట్టుకుని దూషణలు చేస్తున్న నారా లోకేష్ ను చూస్తే.. ‘ఇంత చిల్లరగాడా’ అని గౌరవప్రదమైన సజ్జల రామకృష్ణారెడ్డికి అనిపించిందిట. చంద్రబాబు తన కొడుక్కి ఏం నేర్పుతున్నట్టు? ఇలాంటి మాటల వలన ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అని సజ్జల తన ఆవేదన వ్యక్తం చేశారు.
సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. సజ్జల వంటి పెద్దలకు.. కేవలం లోకేష్ దూషణలు మాత్రమే కనిపిస్తుంటాయా? మిగిలిన సమయాల్లో వారి కళ్లు మూసుకుపోయి ఉంటాయా? వైసీపీ నాయకులు చంద్రబాబు ను ఉద్దేశించి మాట్లాడే నీచమైన మాటలు ఆయన చెవులకు సోకలేదా? అనుకుంటున్నారు. వైఎస్ జగన్ సొంత జిల్లాలో, తనను నియంత్రించ ప్రయత్నించిన పోలీసులతో తగాదా పడి మరీ.. ‘బాబాయిని చంపిందెవరు’ పోస్టర్లను ప్రదర్శిస్తూ.. సీఎం జగన్ ను నిలదీసిన లోకేష్ వైఖరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూసాలను ఖచ్చితంగా కదిలించినట్లే ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles