తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, హస్తినలో అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో జరిగిన ఈ భేటీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా పాల్గొన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రెవేటు కార్యక్రమం అని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. అమిత్ షాతో భేటీలో.. కమలదళంతో తెలుగుదేశం పొత్తులు ఒక కొలిక్కి వస్తాయనే సూచన ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన- బిజెపి కలిసే పోటీచేస్తాయని పవన్ కల్యాణ్ తొలినుంచి చెబుతూనే ఉన్నారు. జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోమని, జగన్ సర్కారు గద్దె దించి తీరుతామని ఆయన చెబుతూ వస్తున్నారు. జనసేన- టీడీపీ పొత్తు తథ్యమనే వాతావరణం సర్వత్రా కనిపిస్తుండగా.. ఈ జట్టులోకి బిజెపి వచ్చి చేరుతుందా? లేదా? అనే మీమాంస నడుస్తూ వచ్చింది. రాష్ట్ర బిజెపి నాయకులు ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతూ వస్తున్నారు. నిజానికి రాష్ట్ర బిజెపి నాయకుల్లో చాలా మందికి తెలుగుదేశంతో కలిసిపోటాచేయాలనే కోరికే ఉంది. కొందరు మాత్రం పొత్తులను పడనివ్వకుండా పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. మెజారిటీ నాయకులు పొత్తుల సంగతి అధిష్ఠానం చూసుకుంటుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ కావడం కీలక పరిణామం.
తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు తమకు మేలు చేస్తుందని కమలదళం భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బిజెపి ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా వారికి ఉన్న క్షేత్రస్థాయి బలం చాలా తక్కువ. తెలుగుదేశం పార్టీకి నాయకుల లేమి ఏర్పడింది గానీ.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పట్ల ఆదరణ అలాగే ఉంది. అందుకే తెలంగాణలో తెలుగుదేశంతో కలిసి పోటీచేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఏపీకి సంబంధించినంత వరకు బిజెపి ఒంటరిగా పోటీచేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి లేదు. పవన్ చెబుతున్నట్టుగా తెలుగుదేశం, జనసేనలతో కలిపి జట్టుగా పోటీచేస్తే కనీసం కొన్ని స్థానాలు దక్కుతాయని.. పార్టీని రాష్ట్రంలో విస్తరించడానికి ఇది మంచి అవకావం అవుతుందని అనుకుంటున్నారు. మరి చంద్రబాబునాయుడు హస్తిన భేటీల ఫలితాలు ఎప్పటికి బయటకు వస్తాయో వేచిచూడాలి.
అమిత్‌షాతో బాబు: చివరి అంకంలోకి పొత్తులు!
Friday, November 22, 2024