విజయవాడ ఎంపీ కేశినేని వైసిపి వైపు అడుగులేస్తున్నారా!

Thursday, December 19, 2024

విజయవాడ నుండి రెండు పర్యాయాలు టీడీపీ ఎంపీగా గెలుపొందిన కేశినేని నాని వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో పార్టీ సీట్ దక్కదని నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకని గత కొంతకాలంగా వైసిపి వైపు అడుగులు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. తాజాగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందా? తాను ఎంపీ అవుతానా? అనే భయం తనకు లేదంటూనే తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని కేశినేని నాని తేల్చి చెప్పడం గమనార్హం.

వైసీపీలోకి కేశినేని నాని వస్తానంటే స్వాగతిస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రాంరెడ్డి మీడియాతో వ్యాఖ్యలు చేసిన రోజే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేశినేని నాని చాలా మంచి వ్యక్తి అని.. ఆయన వైసీపీ వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. కారణాలు ఏమైతేనేమి 2019లో టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్నా ఎప్పుడూ పార్టీపై విమర్శలు చేయని ఆయన ఏకంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అభివృద్ధి కోసం వైసీపీతో కలిసి పనిచేస్తానని అంటూ టిడిపి నాయకులను ఇరకాటంలోకి నెట్టివేస్తున్నారు. ఇదంతా వైసిపిలో చేరబోతున్నారనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నది.

2019 ఎన్నికల తర్వాత అవకావశం దొరికినప్పుడల్లా టీడీపీ పై నాని విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీలో తనకు కట్టబెట్టిన పదవులు కూడా వద్దని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. పార్టీతో సంబంధం లేకుండా విజయవాడలో దాదాపు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు.

పలు సందర్భాలలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపైననే వివాదాస్పద వాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు ఎవ్వరితో సఖ్యతతో వ్యవహరించడం లేదు.  విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నానికి ఇతర నేతలకు మధ్య ఉన్న విబేధాలు మరింత బహిర్గతమయ్యాయి. కేశినేని నాని చంద్రబాబు ర్యాలీలో పాల్గొంటే తాము దూరంగా ఉంటామని బుద్దా వెంకన్న ప్రకటించారు.

చివరకు సొంత తమ్ముడు చిన్ని కూడా దూరమయ్యారు. పార్టీ సీట్ ఇస్తే అన్నస్థానంలో పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు.  దానితో పార్టీ సీట్ ఇస్తే పోటీ చేస్తా లేకపోతే ఇంట్లో కూర్చుంటాను అంటూ ప్రకటనలు ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ సీట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను లేదా ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ప్రకటించడం గమనిస్తే టిడిపికి దూరమవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం అవుతుంది.

ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదని.. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానేమో అంటూ నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడునే హెచ్చరించిన్నట్లు మాట్లాడారు.  ‘నా మాటల్ని పార్టీ ఎలా తీసుకున్నా నాకు భయం లేదు. పార్టీ టికెట్ ఇస్తుందా? నేను ఎంపీ అవుతానా? అనే భయం లేదు. నాకు ట్రాక్ రికార్డు ఉంది. నేను చేసినన్ని పనులు దేశంలో ఏ ఎంపీ చేయలేదు’ అని కేశినేని నాని స్పష్టం చేశారు.

పైగా, బుధవారం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి కేశినేని నాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  తాజాగా కూడా.. టీడీపీకి చంద్రబాబు, వైసీపీకి జగన్ నాయకులని.. వారిద్దరికి వైరం ఉంటే తమకేంటని అంటూ ధిక్కార ధోరణితో వ్యవహరించడం గురించి టిడిపి వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కాలంలో పార్టీ కార్యకర్తలు, నాయకులను వేధింపులకు గురిచేస్తున్న వైసిపి ఎమ్యెల్యేలతో కలిసి కార్యక్రమాలలో పాల్గొనడం, అభివృద్ధి రాజకీయాలలో తనకు రాజకీయాలు లేవని అనడం, పైగా వివాదాస్పదమైన ఎమ్యెల్యేలను బాగా పనిచేస్తున్నారంటూ మెచ్చుకోవడం ద్వారా టిడిపి శ్రేణులను సవాల్ చేసినట్లు వ్యవహరిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం కేశినేని నాని నందిగామ జిల్లాలో పర్యటన సందర్భంగా అక్కడి వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు చాలా మంచి పనులు చేస్తున్నారని కొనియాడారు. అటు జగన్ మోహన్ రావు కూడా కేశినేని నానిపై ప్రశంసలు కురిపించారు. ఆ వ్యవహారం టీడీపీలో రచ్చకు కారణమైంది. నందిగామ టీడీపీకి చెందిన ఓ వర్గం నానిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles