కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి- తాను జైలు పాలు అవుతానేమో అనే భయం ప్రస్తుతానికి తప్పింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను విచారిస్తున్న సిబిఐ అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిలు ఇవ్వాలన్న అవినాష్ అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు మన్నించింది. ఆయనను అరెస్టు చేయడానికి వీలులేదని, అరెస్టు చేయాల్సి వస్తే గనుక ఐదు లక్షల రూపాయల పూచీకత్తుతో వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు సిబిఐ ను ఆదేశించింది. అయితే విచారణ విషయంలో కొన్ని షరతులను విధించింది.
అవినాష్ రెడ్డి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నించకూడదు. జూన్ నెలపొడవునా ప్రతి శనివారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవినాష్ సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ముందస్తు బెయిల్ ఇచ్చిన ఈ విషయంలో విధించిన నియమ నిబంధన లను అతిక్రమించినట్టుగా అనిపిస్తే అవినాష్ అరెస్టుకు కోర్టునుఆశ్రయించవచ్చునని హైకోర్టు పేర్కొంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది పెద్ద ఊరట. ఎంపీ అవినాష్ రెడ్డిని నేడో రేపో అరెస్టు చేస్తారనే భయంతో కొన్ని వారాలుగా వైకాపా శ్రేణులు నానా హడావుడి చేస్తున్నాయి. అవినాష్ తల్లి కి గుండెపోటు వచ్చిన తర్వాత, ఆమెకు చికిత్స అందించిన కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద వైకాపా శ్రేణులు చేసిన హడావుడి హల్చల్ మామూలుది కాదు. ఆసుపత్రి వద్దకు వెళ్లడానికి సిబిఐ అధికారులు జడుసుకునే విధంగా అక్కడి వాతావరణం తయారైంది. తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అవినాష్ మధ్యలో సుప్రీంకోర్టును ఆశ్రయించినా పెద్ద సానుకూల ఫలితం లభించలేదు. అంతకంటే ముందు నుంచి తెలంగాణ హైకోర్టులో ఆయన ప్రయత్నిస్తున్న ముందస్తు బెయిలు పిటిషన్ కు ఇవాళ అనుకూలమైన తీర్పు వచ్చింది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ పాత్ర ఉన్నదని సిబిఐ భావిస్తున్నది. ఆయనకు తెలిసే ఈ హత్య జరిగిందని ఆయన కనుసన్నుల్లోనే మొత్తం హత్యకు పథకం రచించారని.. హత్య చేసినందుకు నిందితులకు డబ్బులను కూడా అవినాష్ చెల్లించారని సిబిఐ రకరకాల ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు విచారణకు పిలిచినప్పటికీ కొన్నిసార్లు మాత్రమే అవినాష్ హాజరయ్యారు. అనేక పర్యాయాలు రకరకాల కారణాలు చెప్పి విచారణకు డుమ్మా కొట్టారు. అవినాష్ ఏ మాత్రం విచారణకు సహకరించడం లేదని కూడా సిబిఐ ప్రధానంగా ఆరోపిస్తోంది. అందుచేతనే ఆయనను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంటారని వాదన తెరపైకి వచ్చింది. అదే అనుమానంతో అవినాష్ కూడా ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు.
జూన్ 31 లోగా వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీం ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో సిబిఐ పరిస్థితి సంకటంగా మారిందని చెప్పాలి. అప్పటిదాకా కేవలం ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని మాత్రమే హైకోర్టు అవినాష్ ను ఆదేశించింది. వచ్చిన రోజుల్లో విచారణకు సవ్యంగా సహకరించక, ఆ తర్వాత వారం రోజులపాటు విచారణకు రాకుండా ఉండేట్లయితే అవినాష్ ను సిబిఐ అనుకున్న రీతిలో విచారించడం.. వారు అనుమానిస్తున్న అంశాలలో నిజానిజాలను రాబట్టడం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది! సిబిఐ అధికారులు ఏం చేస్తారో చూడాలి. ఈ తరహా ఉత్తర్వులపై సుప్రీమ్ ను ఆశ్రయిస్తారో లేదో గమనించాలి!!
అవినాష్‌కు బెయిల్: సీబీఐకు సంకటం!
Thursday, December 19, 2024