ఓఆర్ఆర్ లీజ్ రసభ.. రేవంత్ కు హెచ్‌ఎండీఏ లీగల్ నోటిస్!

Friday, November 15, 2024

తమ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అక్రమాలు, కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలకు లీగల్ నోటీసులు జారీచేయడం కేసీఆర్ ప్రభుత్వంకు పరిపాటిగా మారింది. కొద్దిరోజుల క్రితం ప్రశ్నాపత్రం లీకేజ్ కుంభకోణంకు మంత్రి కేటీఆర్ బాధ్యుడని ఆరోపణలు చేసిన రాష్త్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు రూ 100 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కేటీఆర్ పరువునష్టం కింద లీగల్ నోటీసు జారీచేశారు.

ఆ నోటీసు ఏమైనదో గాని, తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ లీజ్ ఖరారు చేయడంలో కేసీఆర్ కుటుంభం భారీ అక్రమాలకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలపై 24 గంటలలో క్షమాపణ చెప్పాలంటూ హెచ్‌ఎండీఏ  లీగల్ నోటీసు జారీచేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి  నిరాధార ఆరోపణలతో ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది.

నోటీసు అందుకొన్న 48 గంటల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. లోక్‌సభ సభ్యుడిగా, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఏది మాట్లాడినా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుందని, అందువల్ల చేసే ప్రతి ప్రకటన, చెప్పే మాట బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ టోల్ స్కాం వెయ్యి రెట్లు పెద్దదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మొదట్లో కఠిన నిబంధనలతో రూపొందించారని..అయితే కల్వకుంట్ల కవిత, ఇతర సౌత్ లీడర్ల పాలసీలో మార్పులు చేసి వందల కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సీఎం కేజ్రీవాల్కు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారని రేవంత్ చెప్పారు. అయితే ఓఆర్ఆర్ టెండర్ల విషయం లక్ష కోట్లకు సంబంధించినదని, అంత విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ పేర్కొన్నారు.

ఈ ఓఆర్ఆర్ టోల్ స్కామ్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాత్రదారులు కాగా.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అర్వింద్ కుమార్ సూత్రదారులని ధ్వజమెత్తారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు  టీఓటీ టెండర్లు కనీస ధర ప్రకటించకుండా పిలిచారని, ఇది నిబంధనలకు విరుద్దమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

హెచ్‌ఎండీఏ  మాస్టర్ ప్లాన్ అనుసరించి ఏ టెండరు పిలవాలన్నా 2031 లోపే పిలవాలని, కానీ ఓఆర్ఆర్ టెండరును 30 ఏండ్లకు  కట్టబెట్టారని ఆరోపించారు.దేశంలో ఎక్కడైనా 15, 20 ఏళ్లకు టెండర్లు పిలుస్తాంటారని, కానీ తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల లీజుకు రాసిచ్చేసిందని రేవంత్ ధ్వజమెత్తారు. తద్వారా ఓఆర్ఆర్ ను అమ్మేస్తోందని విమర్శించారు. 

అయితే, కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఓఆర్‌ఆర్‌ను లీజుకు ఇచ్చామని హెచ్‌ఎండీఏ స్పష్టంచేసింది. గత ఏడాది నవంబర్‌ 9న రాష్ట్ర ప్రభుత్వం టీవోటీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని, అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు చేపట్టిన ఈ టెండర్‌ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు.

అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ లిమిటెడ్‌కు లీజు ఖరారు చేస్తూ గత నెల 27న లెటర్‌ ఆఫ్‌ అవార్డు జారీచేశామని వివరించారు. టెండర్‌ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు జారీ చేసిన డాక్యుమెంట్లు, ఇతర వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రజలకు అందుబాటులో అన్ని వివరాలు ఉన్నప్పటికీ బాధ్యతాయుత పదవి లో ఉండి కుట్రపూరితంగా ఓఆర్‌ఆర్‌ లీజుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హెచ్‌ఎండీఏ నోటీసుల్లో రేవంత్‌పై మండిపడింది.

ఇలా ఉండగా, బిఆర్ఎస్ – బిజెపి తోడు దొంగలే అని స్పష్టం చేస్తూ  ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని, ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడంలేదు అని నిలదీశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles