ఏపీలో ప్రభుత్వం ఏర్పరచిన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సర్దుకోలేక, తల్లితో కలిసి హైదరాబాద్ కు వచ్చి తండ్రి ఆశయాలకు అంటూ ఇక్కడ ఓ పార్టీ పెట్టుకొని, తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర జరిపినా రాజకీయంగా చెప్పుకోదగిన పట్టు సాధించలేకపోయిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చివరకు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
మరో ఆరు నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో కనీసం సమర్థులైన అభ్యర్థులను సహితం పోటీకి పెట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. ఆమె తప్పా చెప్పుకోదగిన నాయకులెవ్వరూ ఆమె పార్టీలో చేరడం లేదు. నిత్యం ప్రభుత్వంపై పోరాటాలు, కఠినమైన పదజాలంతో ప్రకటనలు చేస్తూ జనంలో నానుతున్న ఓ రాజకీయ శక్తిగా ఎదగనితో మనుగడ కష్టమని గ్రహించినట్లున్నారు.
ఆమె పోరాట పటిమతో ముచ్చటపడిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆమెను పార్టీలో చేర్చుకొనేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తున్నది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం ద్వారా తెలంగాణలో వైఎస్ అభిమానుల ఓట్లను పొందడంతోపాటు ఏపీలో సీఎం జగన్ కు చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నది.
పైగా, జగన్ కేంద్రంలోని బిజెపి నాయకత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉండటం, తెలంగాణాలో సహితం సీఎం కేసీఆర్ తో మిత్రత్వం నెరుపుతూ ఉండడంతో ఆమెను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలతో పాటు బీజేపేని సహితం ఇరకాటంలో పడవేయవచ్చని భావిస్తున్నారు.
షర్మిల చేరిక ద్వారా ఏపీలో నామమాత్రంగా ఉన్న తమ పార్టీ బలం పెంచుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. మరోవంక, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటంతోపాటు వైఎస్సార్ అభిమానులు, రెడ్డి, క్రిస్టియన్ సామాజిక ఓట్లను తమ వైపు కేంద్రీకృతం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు పాదయాత్రలు నిర్వహించడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న షర్మిలను చేర్చుకోవడం తెలంగాణలో కొంత మేర కలిసొస్తుందని భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారిస్తున్నది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే షర్మిల బెంగళూరు వెళ్లడంతో పాటు, అక్కడ డీకే శివకుమార్ ను కలసి సమాలోచనలు జరపడం ఆసక్తి కలిగిస్తున్నది. ఈ సందర్భంగా శివకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఫోటోను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు కూడా.
“ప్రియమైన సోదరుడు శ్రీ డీకే శివకుమార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత జరుపుకొనే ఈ పుట్టిన రోజు మీకు మరింత మధురమైనదని, ముఖ్యమైనదని భావిస్తున్నాను. కర్ణాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా” అంటూ ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేశారు.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మొదటి నుండి శివకుమార్ మద్దతుదారునిగా ఉంటున్నారు. కర్ణాటక ఎన్నికలు పూర్తవడంతో తెలంగాణ ఎన్నికలలో రాజకీయ వ్యూహాల విషయంలో రేవంత్ కు శివకుమార్ తోడుగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ ఎన్నికలలో బిజీగా ఉండే కాంగ్రెస్ అధిష్టానం సహితం తెలంగాణ ఎన్నికల బాధ్యతను శివకుమార్ కె అప్పగించే అవకాశం ఉంది.
ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వ్యూహకర్త సునీల్ కనుగోలు కొంతకాలంగా షర్మిలతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు ఆమె కొన్ని డిమాండ్ లను ఆ పార్టీ అందించినట్లు చెబుతున్నారు.
తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఖమ్మం జిల్లా పాలేరుతో పాటు మరికొన్ని సెగ్మెంట్లను తన అనుచరులకు ఇవ్వాలని ఆమె కోరినట్టు తెలిసింది. ఆమె డిమాండ్లను సునీల్ కనుగోలు హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం.