టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళంస’ పాదయాత్ర సోమవారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు.
ఈ పాదయాత్రలో లోకేష్ మాతృమూర్తి నారా భువనేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు. మార్గంమధ్యలో తల్లి షూ లేస్‌ను లోకేశ్ కట్టారు.
పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరించారు. బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో ‘యువగళం’ పాదయాత్ర జాతరను తలపిస్తోంది. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ దగ్గర ప్రత్యేక సంచిక ‘జనహృదయమైనారా లోకేష్’ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు పాల్గొన్నారు.
లోకేశ్ తండ్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా తనయుడికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. తన యువగళం పాదయాత్రను దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకున్న లోకేశ్ కు శుభాకాంక్షలు అని ట్వీట్ లో పేర్కొన్నారు. తన ఈ పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకొని, వాటికి పరిష్కార మార్గం కనుగొనడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇంకా ఎన్నో మైళ్లు ప్రయాణించవలసి ఉందని చెప్పారు.
పాదయాత్రలో కుటుంబసభ్యులలో లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు లోకేశ్‌తో కలిసి ముందుకు సాగారు.
పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో బోయరేవుల క్యాంప్‌సైట్, మోతుకూరు పరిసరాల్లో 3.కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
యువగళం 100 రోజుకు చేరిన సందర్భంగా లోకేష్ ట్వీట్ చేశారు. ‘అడ్డంకుల్ని లెక్క చేయలేదు. ఎండలకి ఆగిపోలేదు. వాన పడితే చెదిరిపోలేదు. ప్రజల కోసం నేను..నా కోసం ప్రజలు యువగళం పాదయాత్రని ముందుండి నడిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు, యువగళం వలంటీర్లు, కమిటీలు, తెలుగుదేశం కుటుంబసభ్యులు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు’ అని పేర్కొన్నారు.
`పాదయాత్ర ప్రజల యాత్ర అయింది. యువగళం జనగళమైంది. యువగళం పాదయాత్రని విధ్వంసక, ఆటవిక సర్కారుపై ప్రజాదండయాత్రని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని లోకేష్ తెలిపారు.
మరోవైపు తెలంగాణ టిడిపి తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్ తదితరులు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు చెంచు సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. వారి సమస్యలను సావధానంగా విని,అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. యువగళంకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు.