గవర్నర్ తమిళసైతో సర్దుబాటు బాటలో కేసీఆర్!

Thursday, May 16, 2024

గత కొంతకాలంగా తెలంగాణ రాజ్ భవన్ కు, సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ కు పెరిగిన దూరం తగ్గబోతుందా? గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను దాదాపు `బహిష్కరించిన’ విధంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం దిద్దుబాటు నిర్ణయానికి వచ్చిందా? గవర్నర్ తో సాధారణ సంబంధాలు, మర్యాదలు కొనసాగించేందుకు సిద్దమయ్యారా?

గవర్నర్ భద్రాద్రి శ్రీరాముడి దర్శనంకోసం గురువారం వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు హెలికాఫ్టర్ సదుపాయం కల్పించడం, భద్రాచలంలో అధికారులు సాధారణ మర్యాదలు చేయడంతో ఆమె పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తన ధోరణి మార్చుకున్నట్లు సంకేతం ఇచ్చినట్లయింది.  గత రెండేళ్లుగా ఆమె కోరినా ఆమె పర్యటనలకు హెలికాఫ్టర్ సమకూర్చకపోవడంతో ఆమె రైలులోనే, కారులోనే వెళ్లడం జరుగుతుంది.

అదేవిధంగా తాను ఎక్కడకు వెళ్లినా అధికారులు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆమె పలుసార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ వంటి అధికారులు తనను కలవడం లేదని, అధికారులు తన పర్యటనలకు తగు ఏర్పాట్లు చేయడంలేదని అంటూ ఆమె బహిరంగ వేదికలపైననే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా హైకోర్టు జోక్యంతో ఆమెను ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించడం, ఆమె  శాసనసభలో ప్రసంగించడంతో ప్రభుత్వంతో ఆమెకు దూరం తగ్గిందని అందరూ భావించారు. అయితే, ఆ తర్వాత యధావిధిగా వివాదాలు చెలరేగుతూ వచ్చాయి. ఆమె అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పెండింగ్ లో ఉంచడం, రాజ్ భవన్ కు మంత్రులు, అధికారులు ఎవ్వరు వెళ్ళకపోవడం కొనసాగిస్తూ వచ్చారు.

చివరకు పెండింగ్ బిల్లులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు కన్నా రాజ్ భవన్ దగ్గరని, ఇక్కడకు వస్తే వాటికి ఆమోదం లభించెడిది అన్నట్లు గవర్నర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏదిఏమైతే నేమి సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో ఆమె హడావుడిగా ఆ బిల్లులను రాజ్ భవన్ నుండి పంపించి వేయవలసి వచ్చింది.

గవర్నర్ కొన్ని బిల్లులకు అమోదం తెలపడంతో పాటు మరికొన్నింటిని వెనక్కి తిప్పి పంపారు. మరికొన్నింటిని రాష్ట్రపతికి పంపారు.  పెండింగ్‌ బిల్లులపై గవర్నర్ కార్యాలయం చర్యలు తీసుకోవడంతో సుప్రీం కోర్టు కూడా విచారణ లేకుండానే వివాదాన్ని ముగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

గవర్నర్ డా. తమిళసై గురువారం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో భద్రాచలం వెళ్లారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామిని దర్శించుకుని భద్రాచలంలోని శ్రీ కృష్ణ మండపంలో హెల్త్ అవేర్ నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్ కు వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

గత కొంత కాలంగా గవర్నర్ పర్యటనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఐదారు వారలక్రితమే  భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవాలకు సైతం గవర్నర్ వాహనంలోనే వేడుకులకు హాజరు కావాల్సి వచ్చింది.  తాజాగా, డా. అంబెడ్కర్ విగ్రవిష్కరణ, సచివాలయ ప్రారంభోత్సవానికి తనను ప్రభుత్వం ఆహ్వానించలేదని, ఆహ్వానాలు వచ్చి ఉంటె హాజరయ్యేదాన్ని అంటూ గవర్నర్ పేర్కొనడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles