తెలుగు రాష్ట్రాల మధ్య  ఎటూ తేల్చని నీటి పంచాయతీ

Sunday, January 19, 2025

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఒకరి రాజకీయ ప్రయోజనాలకోసం మరొకరు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు కేసీఆర్ హైదరాబాద్ నుండి ఎత్తుగడలు వేస్తుంటే, తెలంగాణాలో కేసీఆర్ ప్రత్యర్థులతో కలకలం సృష్టించేందుకు తాడేపల్లి నుండే వైఎస్ జగన్ చక్రం తిప్పుతుంటారు.

అయితే, ఇద్దరు కలసి రెండు రాష్ట్రాల మధ్య తొమ్మిదేళ్లుగా తేలకుండా మిగిలిన విభజన సంబంధిత సమస్యల పరిష్కారం కోసం మాత్రం ఎటువంటి చొరవ చూపడం లేదు. గతంలో వైఎస్ జగన్ ను ఇంటికి పిలిచి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకు రావడం లేదు. పైగా, రాజకీయ వేదికలపై పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పిస్తూ స్థానిక ప్రజల `సెంటిమెంట్’ రగిల్చి రాజకీయ లబ్ది పొందేందుకు ఇద్దరు సీఎంలు ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

అటువంటిదే కృష్ణా జలాల పంపిణీ. హైదరాబాద్ లోని జలసౌదలో జరిగిన  కృష్ణా రివర్   మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి ఎలాంటి వాటా ఖరారు చేయలేదు. ఎందుకంటే 66:34  నిష్పత్తిలో నీటి కేటాయింపులు ఉండాలని ఏపీ చెబుతుండగా,  50 శాతం వాటా కావాలని తెలంగాణ పట్టుబడుతోంది. దీంతో వాటాల ఖరారు అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.  

ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉండాలని  ఖచ్చితంగా ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టం చేశారు. 66:34 శాతం నీటి వాటాకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.  శ్రీశైలం నుంచి ఏపీ 34 టీంఎసీలు మాత్రమే వినియోగించుకోవాలని చెప్పారు.

గత కొంత కాలంగా కృష్ణా నదిలో 50 శాతం వాటాపై నీటి వినియోగంపై  తెలంగాణ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఆంద్రప్రదేశ్ అభ్యంతరం చెబుతోంది.  జూన్ 1 నుంచి  కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో  ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులోని పంట విస్తీర్ణానికి తగిన సరఫరా అందించాల్సిన అవసరం ఉన్నందున  నదీ జలాల్లో 50 శాతం వాటా కోసం తెలంగాణ అధికారులు బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారు.  

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ మధ్య 34: 66 నిష్పత్తిలో కృష్ణా నీటి కృష్ణా జలాల పంపిణీని నిర్ణయించారు. రాష్ట్ర అధికారుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా కేఆర్ఎంబీ  గత తొమ్మిదేళ్లుగా అదే విధంగా పంపిణీ చేస్తోంది.   బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపే వరకు 50: 50 నిష్పత్తిలో   కేటాయింపులు జరపాలని 22 అంశాలతో తెలంగాణ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇద్దరు సీఎంలు కలిసి ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ వారటువంటి ప్రయత్నం చేయడం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles