సీనియర్ హీరో సుమన్ భారత రాష్ట్ర సమితిపై మనసు పడ్డారు. తెలంగాణలో ఆ పార్టీ ది బెస్ట్ అని ఆయన కితాబు ఇచ్చేశారు. తాను తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి తీరుతానని కూడా ఈ హీరో ప్రకటించారు. గతంలో కూడా రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న హీరో సుమన్ ఇప్పుడు భారాసను కీర్తిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ లో ఆయన చేరుతారా? ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? తెలంగాణ నుంచా, ఏపీ నుంచా? అనే చర్చలు ఇప్పుడు ఆయన మొదలవుతున్నాయి.
ఒకప్పట్లో కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ గా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో సుమన్.. నీచల్ కులం అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించి దాదాపుగా అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించారు. ఒకప్పట్లో కరాటే ఆధారిత యాక్షన్ సినిమాలకు ఐకాన్ గా నిలిచారు. తర్వాతికాలంలో బ్లూఫిలింలలో నటిస్తున్నారనే నేరారోపణలు రావడంతో జైలు పాలయ్యారు. ఆయన కెరీర్ కూడా ట్రబుల్స్ లో పడింది. జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత.. సినిమా కెరీర్ అదివరకటి స్థాయిలో సాగలేదు. సపోర్టింగ్ పాత్రలు, కేరక్టర్ పాత్రలు చేస్తూ వచ్చారు. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరుడిగా కూడా గెస్ట్ పాత్రలో మెప్పించారు.
ఆయన సినిమా ప్రస్థానం ఇలా ఉండగా.. దీనికి సమాంతరంగా రాజకీయాలు కూడా సాగుతూ వచ్చాయి. ఆయన 1999లో తెలుగుదేశంపార్టీలో చేరి.. చంద్రబాబునాయుడుకోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 2004 వచ్చేసరికి భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పట్లో ప్రచారం చేశారు కానీ పార్టీ నెగ్గలేదు. తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు.
తాజాగా సుమన్ గోదావరి జిల్లాలో జరిగిన ఒక ప్రెవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా రాజకీయాలు మాట్లాడుతూ.. తన ఎంట్రీ గ్యారంటీ అని తేల్చేశారు. అలాగే తనకు బీఆర్ఎస్ గొప్పపార్టీ అని నమ్మకం ఉందని కూడా చెప్పారు. అయితే ఏపీనుంచి బరిలోకి దిగుతారా, తెలంగాణనుంచి బరిలోకి దిగుతారా అనే సంగతి చెప్పలేదు.
సుమన్ కు భారాస అంటే మోజు ఉండచ్చు. ఈ సంగతి అసలు ఆ పార్టీ పెద్దలకు తెలుసునా? ఆయన రాజకీయాసక్తిని వారు ప్రోత్సహిస్తారా? లేదా, కేవలం ప్రచారానికి మాత్రం వాడుకుంటారా? అనేది సందేహమే.
‘గులాబీ’పై మనసుపడ్డ సీనియర్ హీరో!
Friday, November 22, 2024