ముద్రగడ రాజకీయ ప్రవేశం జగన్ ను ఆదుకోవడం కోసమేనా!

Friday, November 22, 2024

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి క్రియాశీల రాజకీయాల వైపు చూస్తున్నారు.  సుదీర్ఘకాలం ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఇటీవల తుని రైల్వే దహనం కేసును రైల్వే కోర్టు కొట్టేయడంతో, అందులో ముద్దాయిగా బయటపడిన తర్వాత మళ్ళి ప్రజా జీవనం వైపు చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

ముద్రగడ ఆధ్వర్యంలో జరిగిన కాపు సదస్సు  ముగియగానే ఈ రైల్వే దగ్ధం, విధ్వంసం జరగడంతో ఆయనకు మచ్చగానే మిగిలింది. కేవలం అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అప్రదిష్ట కావించేందుకు జరిగిన రాజకీయ కుట్రలో ఆయన ఓ పావుగా మారినట్లు విమర్శలు చెలరేగాయి. అందుకు నాటి ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్న అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

బుధవారం కాపు సామజికవర్గంకు వ్రాసిన బహిరంగలేఖలో త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని పద్మనాభం ప్రకటించారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం బుధవారం కాపు సామాజిక వర్గం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ విషయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఒక విధంగా దండయాత్ర జరిపిన ఆయన, నాటి ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ ను అమలు పరచకుండా తుంగలో తొక్కిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట తినకపోవడం గమనార్హం.

ఆ విధంగా జగన్ ప్రభుత్వానికి ఆయన పరోక్ష మద్దతు సమకూర్చారని స్పష్టం అవుతుంది. పైగా, గత ఎన్నికలలో కాపు సమాజం ఓట్లు కొంతమేరకు వైసీపీకి వచ్చేటట్లు చేయడంలో కూడా అయన పాత్ర ఉందని అర్థం అవుతుంది.  తన జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానని ఇప్పుడు తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆ విధంగా చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం లేదు.

రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటూ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్న పద్మనాభం ఈ విషయమై సీఎం జగన్ కు ఒకటి, రెండు లేఖలు రాయడం మినహా గత నాలుగేళ్లుగా చేసింది ఏమీ లేదు. తిరిగి ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును త్వరలోనే ప్రకటించనున్నట్టు పేర్కొనడం కాపు ఓట్లు జగన్ కు వ్యతిరేకంగా సమీకృతం చేయకుండా చేసే ప్రయత్నంగానే కనిపిస్తుంది.

ఇప్పుడు బహుశా కాపు సామాజిక వర్గం మాదిరిగా మరే సామాజిక వర్గం కూడా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల అంతగా ఆగ్రవేశాలు వ్యక్తం చేయడం లేదని చెప్పవచ్చు. వారి రాజకీయ ఉనికినే ధ్వంసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే వైసిపి వైపు మొగ్గు చూపిన సిహెచ్ హరిరామజోగయ్య, వంగవీటి రాధా, గంటా శ్రీనివాసరావు వంటి వారు ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పట్టుదల చూపుతున్నారు.

ఇంకోవైపు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండే విధంగా రాజకీయ పొత్తులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉనికి మొదటి నుండి జగన్ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నది. ఈ ప్రమాదాల నుండి జగన్ ప్రభుత్వాన్ని కాపాడేందుకే ముద్రగడ పద్మనాభం రాజకీయ రంగం ప్రవేశం అంటున్నారా? అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles