మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి బిజెపి వైపు చూస్తున్నారా!

Saturday, November 16, 2024

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా కొనసాగుతూ,  మెదక్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, తెలంగాణ శాసనసభకు తొలి డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన పద్మా దేవేందర్‌రెడ్డి ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారనే కధనాలు వెలువడుతున్నాయి. ప్రతిపక్ష ఎమ్యెల్యేగా గతంలో  అన్ని పోరాటాలలో ముందుండే ఆమెను 2014లో కేసీఆర్ మొదటి మంత్రివర్గంలోని ఉంటుందని అందరూ భావించారు.

అయితే, అప్పట్లో మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టారు. ఆ తర్వాత ఆ పదవి కూడా లేదు. ఈ సారి అసలుకే మోసం చేస్తూ వచ్చే ఎన్నికలలో ఆమెకు సీట్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది.  తెలంగాణ ఉద్యమం కాలం నుండి ఆమె ఆర్ధిక మంత్రి టి హరీష్ రావుకు సన్నిహితంగా ఉంటూ ఉండడంతో మంత్రి కేటీఆర్ ఆమెకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారనే  ప్రచారం జరుగుతుంది.

పార్టీలో సీనియర్‌ నేత అయినప్పటికీ, మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎప్పుడు, ఎక్కడా అసమ్మతి స్వరం లేకుండా పార్టీకి విధేయురాలిగా ఉంటున్న తనను పార్టీ నుండి బైటకు పంపే కుట్రలు జరుగుతున్నట్లు ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు.

తాజాగా, ఆమె భర్త దేవేందర్‌రెడ్ ఇఫ్కో డైరెక్టర్‌ హోదాలో ఏప్రిల్‌ 27న డిల్లీలో జరిగిన ఇఫ్కో సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఆయన కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇది మర్యాదపూర్వకమే అని చెబుతున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పద్మకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోతే బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని భావిస్తున్నారనే ప్రచారంకు ఆజ్యం పోసినట్లయింది.

మరోవంక, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోసిన్నట్లయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన సీఎంకేసీఆర్‌ బీఆర్‌ఎ్‌సలో సీనియర్‌ అయిన పద్మా దేవేందర్‌రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వరని బీజేపీ నేత ప్రశ్నించడం బిఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. ఆమెకు వ్యతిరేకంగా ప్రగతి భవన్ మద్దతుతోనే మెదక్ లో వ్యవహారాలు జరుగుతున్నాయనే అభిప్రాయం బలపడుతూ ఉండడంతో ఇటువంటి ప్రచారం ఉపందుకొంటున్నది. 

ఖమ్మం జిల్లాలో, ఇతరత్రా సిట్టింగ్ లను కాదని సీట్ ఆశిస్తున్న వారికి గట్టి హెచ్చరికలు పంపుతున్న బిఆర్ఎస్ అధిష్టానం మెదక్ నియోజకవర్గం విషయంలో మాత్రం పట్టించుకోక పోవడం, పైగా, ప్రగతి భవన్ కు సన్నిహితులే తన సీట్ కోసం బహిరంగంగా కార్యకలాపాలు సాగిస్తూ ఉండడంతో పద్మా దేవేందర్ రెడ్డికి పార్టీలో పొగ పెడుతున్నట్లు స్పష్టం అవుతుంది.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు డాక్టర్‌ రోహిత్‌ కూడా స్వచ్ఛంద సంస్థ పేరిట ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్‌ నుంచి మైనంపల్లి రోహిత్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో హన్మంతరావుకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రోహిత్‌కు టికెట్‌ హామీ లభించినట్లు చెబుతున్నారు.

మరోవైపు మెదక్‌ నియోజక వర్గానికే చెందిన మరో నేత, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గం కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమ నేతకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. సీఎం రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సుభాష్  రెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి పని చేస్తున్నారు. తరచూ నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పద్మా దేవేందర్ రెడ్డి తాజాగా మంత్రి కేటీఆర్ ను కలసి తన నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరు చేయమని కోరుతూ వినతిపత్రం సమర్పించడం ఆసక్తి కలిగిస్తున్నది. కేటీఆర్ ఆమెను పిలిపించారా? కేటీఆర్ మైండ్ ఎలా ఉందొ తెలుసుకొనేందుకు ఆమె వెళ్ళారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles