పార్టీ మార్పుపై ఇరకాటంలో విష్ణుకుమార్ రాజు

Friday, November 22, 2024

రాజకీయ పొత్తుల గురించి పార్టీ వైఖరిని ధిక్కరిస్తూ ప్రకటనలు చేస్తున్నందుకు రాష్ట్ర పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు  రాజకీయ భవిష్యత్తు విషయంలో ఇరకాటంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. టిడిపి, జనసేనలతో కలిసి బిజెపి ఉమ్మడిగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని బలంగా ఆయన చేస్తున్న వాదనలకు పార్టీ అధిష్టానం ఒప్పుకోవడం లేదు.

ఆ రెండు పార్టీలతో పొత్తుల్లేకుండా ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో బిజెపి ఒక సీట్ కూడా గెల్చుకోలేదని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకే చెప్పిన్నట్లు ఆయన వెల్లడించారు. వాస్తవాని బిజెపి ఒంటరిగా పోటీచేసిన 2019 ఎన్నికలలో రాష్ట్రం మొత్తమ్మీద ఎక్కువగా ఓట్లు వచ్చినవారిలో ఆయన ఉన్నారు. ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నం నార్త్ నుండి పోటీచేస్తే 18,790 ఓట్లు వచ్చాయి.

2014లో టిడిపితో పొత్తు కారణంగా ఆయన బిజెపి అభ్యర్థిగా ఈ సీటును గెల్చుకున్నారు. అంతకు ముందు 1999లో సహితం టిడిపితో పొత్తు కారణంగా బిజెపి అభ్యర్థిగా ఇక్కడి నుండే ప్రస్తుత మిజోరాం గవర్నర్ డా. కె హరిబాబు గెలుపొందారు. ఇప్పుడు మరోసారి పొత్తులు లేకుండా పోటీచేసి ఓటమి చెందడానికి ఆయన సిద్ధంగా లేన్నట్లు ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.

బిజెపి ఒంటరిగా పోటీచేసే పరిస్థితులలో టిడిపి లేదా జనసేనలలో చేరి ఆ రెండు పార్టీల అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకనే బిజెపి వైఖరి గురించి తరచూ విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. అయితే, ఇప్పుడు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో ఆయన తన ధోరణిని మార్చుకోమని పక్షంలో పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. లేదా కన్నా లక్ష్మీనారాయణ మాదిరిగా ఆయన పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుంది.

ఏది జరిగినా టిడిపిలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చాలాకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఆయనపై టిడిపి అభ్యర్థిగా గెలుపొందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గంటాకు మరోవంక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహితం మంచి సంబంధాలు ఉన్నాయి.

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్యెల్యేలు అందరికి తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్యెల్యేను కాదని విష్ణుకుమార్ రాజుకు టిడిపిలో చేరినా వచ్చే ఎన్నికలలో విశాఖ నార్త్ సీట్ ఇవ్వడం ఇబ్బందికరమైన అంశం కానున్నది.  ఆయనకు మరో సీట్ సర్దుబాటు చేయడం సహితం టిడిపికి అంత తేలిక కాకపోవచ్చు.

అయితే, గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకు ఒక సారి పోటీచేసి, గెలిచినా నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయలేదు. అదే విధంగా ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్హ్దిగా ఎక్కడి నుండి పోటీచేసినా  ఓటమి ఎరుగరు. 1999 నుండి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. అందుకనే, చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని గంటాను మరోచోట నుండి పోటీచేసేటట్లు చేయగలరా?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles