తిరిగి జగన్ దర్బార్ లో విజయసాయిరెడ్డికి పూర్వవైభవం!

Saturday, November 23, 2024

అక్రమార్జనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులు అన్నింటిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ 1 కాగా,  ఎంపీ విజయసాయిరెడ్డి ఏ2 గా ఉంటూ వచ్చారు. జగన్ తో పాటు జైలులో కూడా గడిపారు. ఈ కేసులు అన్నింటిని నిర్వీర్యం చేయడంలో విజయసాయిరెడ్డి మేధస్సే ఎక్కువగా ఉపయోగపడుతూ వస్తున్నది. చివరకు కాంగ్రెస్ నుండి బైటకు వచ్చి, వైసిపి పార్టీ ఏర్పాటులో సహితం విజయసాయిరెడ్డి కుడి భుజంగా ఉంటూ వచ్చారు.

పార్టీలో, ప్రభుత్వంలో జగన్ కు కుడిభుజంగా, నం 2 గా ఉంటూ, ఎక్కడ ఏ సమస్య ఏర్పడినా చక్కదిద్దడంలో నేర్పరిగా పేరొందారు. ఢిల్లీలో పిఎంఓకు నేరుగా వెళ్లి, జగన్ కు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడంలో కూడా ఆరితేరారు. విజయసాయిరెడ్డి కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా వంటివార్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పక్కకు నెట్టివేసి జగన్ `ఆప్తమిత్రుడు’గా చూడటం ప్రారంభించారు.

అయితే తాడేపల్లి ప్యాలెస్ లో కొత్త అధికార కేంద్రాలు ప్రారంభం కావడంతో విజయసాయిరెడ్డిని క్రమంగా దూరం పెట్టడం ప్రారంభమైంది. ముఖ్యంగా గత ఏడాదికి పైగా ఆయన నుండి ఒకొక్క బాధ్యతను తీసివేయడం ప్రారంభం అవుతూ వచ్చింది.

మొదట ఉత్తరాంధ్ర ఇంఛార్జి బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించారు. సాయిరెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు తప్పించిన సమయంలో పార్టీ అనుబంధ విభాగాలు సాయిరెడ్డి ఆధ్వర్యంలోనే నడిచేవి. విశాఖ నుంచి వచ్చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు తాడేపల్లిలోనే సాయిరెడ్డి మకాం వేశారు.

వైసీపీ అనుబంధ విభాగాలతో వరుసగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడంపై వరుసగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అనూహ్యంగా పార్టీ అనుబంధ విభాగాలకు కూడా వేరే బాధ్యుల్ని నియమించారు.  మరోవంక, ఆయన పర్యవేక్షిస్తూ వచ్చిన పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల కుమారుడికి అప్పచెప్పడంతో సోషల్ మీడియాలో సహితం ఆక్టివ్ గా ఉండటం లేదు.

దీంతో సాయిరెడ్డి ఢిల్లీకి పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీలో అనుబంధ విభాగాలకు వేర్వేరుగా బాధ్యుల్ని నియమించడంతో తాడేపల్లిలో సాయిరెడ్డికి పని లేకుండా పోయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందే సాయిరెడ్డి తాడేపల్లి రావడం తగ్గిపోయింది.

ఢిల్లీలో సహితం ఆయనను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన రాజ్యసభ సభ్యులతో పిఎంఓ, ఇతరత్రా వ్యవహారాలు చుసేటట్లు జగన్ విఫల ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం ఒకవంక వైఎస్ వివేకా హత్యకేసులో ఎప్పుడు ఏమిజరుగుతుందో తెలియక పోవడం, పార్టీ ఎమ్యెల్యేలలో తిరుగుబాటు ధోరణులు, చివరకు సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి వంటివారు సహితం ప్రత్యర్థి పార్టీలోకి వెడతారనే కధనాలు వెలువడడంతో సీఎం జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఈ పరిస్థితులకు కారణం విజయసాయిరెడ్డి వంటి `క్రైసిస్ మేనేజర్’ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో లేకపోవడమే అని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ధోరణి కొత్త కొత్త సమస్యలను తీసుకొస్తున్నట్లు గ్రహించారు. 

ముఖ్యంగా బాలినేని తిరుగుబాటు జగన్ ను షాక్ కు గురి చేసినట్లు చెబుతున్నారు. సజ్జల సరిగ్గా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దకపోవడమే కారణంగా భావిస్తున్నారు. ఎన్నికలు మరో ఏడాదిలో జరుగనున్న నేపథ్యంలో అందరిని సమన్వయంతో నడిపించడానికే విజయసాయిరెడ్డి అవసరం ఉందని సీఎం జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

గత వారం ఆయనను పిలిపించి జగన్ మాట్లాడారని, త్వరలో ఆయనకు కీలక ఆబాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలందరిని సమన్వయం చేసే బాధ్యతలు జగన్ సాయిరెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో ఉత్తరాంధ్ర వరకే సాయిరెడ్డి పరిమితం కాగా ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నాయకుల్ని సమన్వయ పరిచే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles