ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తూ ఉండడంతో కొత్తగా పారిశ్రామికవేత్తలు ఎవ్వరో పెట్టుబడులతో రాష్ట్రానికి రాకపోగా, రాష్ట్రంలో ఉన్న వారు సహితం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా సొంత రాష్ట్రం ఏపీలో పెట్టుబడులు పెడదామని హైదరాబాద్ నుండి అక్కడకు వెళ్లిన పలువురు ఇప్పుడు ఇక్కడకు తిరిగి వస్తుండటంతో పాటు, ఏపీలో ఉన్న పారిశ్రామికవేత్తలు సహితం తెలంగాణవైపు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు శాపం.. తెలంగాణకు వరమైంది. ఏపీలో రాజకీయ వేధింపుల పర్వం బ్యాటరీల తయారీలో ఆసియాలోనే అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అమరరాజా బ్యాటరీస్ సంస్థ తన కొత్త లిథియం-ఐయాన్ బ్యాటరీల తయారీ యూనిట్‌ను 37 ఏళ్లుగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలో స్థాపించేందుకు శ్రీకారం చుట్టారు. గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరారాజా బ్యాటరీస్ వేధింపులకు గురిచేసి, వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న వారి ఫ్యాక్టరీని మూసివేసేవిధంగా చేయడంతో ఇప్పుడు వారు పొరుగు రాష్ట్రంలలో పెట్టుబడులు పెడుతున్నారు.
ఇప్పటికే తమిళనాడులో పెట్టుబడులు పెట్టిన అమర రాజా తాజాగా రూ. 9,500 కోట్ల పెట్టుబడులతో తెలంగాణాలో మహబూబ్‌నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్‌లో భారతదేశంలోనే ఇది అతి పెద్ద పెట్టుబడి అని కేటీఆర్ పేర్కొన్నారు.
తిరుపతి పరిసరాలను దాటి వెళ్లడం ఇష్టం లేని జయదేవ్ తండ్రి గల్లా రామచంద్ర నాయుడు స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 40 నుంచి 50 వేల మంది వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారు. `నా జన్మభూమి పుణ్యభూమి’ అనుకునే రామచంద్ర నాయుడు ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లలో పెట్టుబడులను పెడుతున్నారు. దానికి కారణం జగన్ ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి అన్నది నిర్వివాదాంశం.
ఒక పరిశ్రమ రావాలంటే దాని వెనుకాల తదేకమైన దీక్షతో, పట్టుదలతో పని చేస్తేనే వస్తాయి. ఇది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అవినీతి రహిత పారదర్శకమైన పాలనతో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా అమరరాజా గ్రూప్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. దివిటిపల్లిలో ప్లాంట్ పెడుతామని ప్రకటించిన తర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి తమ తమ రాష్ట్రాలకు రావాలని ఆహ్వానించారు.
కానీ అమరరాజా గ్రూప్ వారు ఇక్కడే ప్లాంట్ ప్రారంభించేందుకు సముఖత వ్యక్తం చేశారు. జగన్ గెంటివేస్తున్న పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు మిగిలిన రాష్ట్రాలు ఏవిధంగా పోటీపడుతున్నాయి ఈ ఉదంతమే స్పష్టం చేస్తుంది.
అమరారాజ యూనిట్ తెలంగాణకు రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. దీని వల్ల చుట్టు పక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
అమరరాజా గ్రూప్ రాబోయే పదేండ్ల కాలంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. 3 సంవత్సరాల్లో రూ. 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మిగతా పెట్టుబడి దశల వారీగా పెట్టనుంది. అమరరరాజా యొక్క 37 ఏండ్ల చరిత్ర పరిశీలిస్తే.. దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్‌లోనే పెట్టుబడి పెడుతున్నారు.