ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆర్ద్రతతో మాట్లాడారు. ఒక వైపు ఆయనకు తెలుగుదేశం ఆఫర్లు కూడా ఉన్నాయనే పుకార్లు కూడా వినవస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్ కుటుంబానికి ఆత్మీయుడైన బాలినేని శ్రీనివాసరెడ్డికి సొంత పార్టీలోనే ప్రతికూల వాతావరణం ఏర్పడడం.. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని, ప్రచారం జరుగుతున్నదని, కొందరు తన గురించి జగన్ కు చెప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది.. చాలా సీరియస్ విషయం.
నా పై ఆరోపణల వెనుక ఎవరున్నారో అధిష్ఠానమే తెలుసుకోవాలి.. అని బాలినేని బంతిని జగన్ కోర్టులో పడేశారు. నేను పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారు. నామీద బురద చల్లుతున్నారు. నేను ఎవ్వరి మీదా సీఎంకు ఫిర్యాదు చేయలేదు. నాకా మనస్తత్వం లేదు. కానీ.. నేను టికెట్ ఇప్పించిన వారే నా మీద ఫిర్యాదులు చేస్తున్నారు.. అంటూ బాలినేని వాపోవడం పార్టీలో చాలా మందికి హెచ్చరిక.
సొంతం చుట్టం అయిఉండి.. జగన్ కు ఎంతో ఆత్మీయుల కేటగిరీలో ఉండే బాలినేని వంటి నాయకుడికే.. పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎదురైనదంటే.. ఇక మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి అనే మధనం పలువురిలో ఇప్పటికే మొదలౌతోంది.
నన్ను వ్యతిరేకించే వాళ్లు పార్టీకి చాలా నష్టం చేస్తున్నారు. నేను ఎన్నడూ అలా పార్టీకి చేటు చేయలేదు అని బాలినేని కన్ఫెస్ చేస్తున్నారు.
పార్టీకి చేటుచేస్తున్న వారి మీద అధిష్టానమే చర్యలు తీసుకోవాలని, ఈ వివాదాలకు ముగింపు పలకాలని బాలినేని హితవు చెబుతున్నారు. మూడు జిల్లాల్లో గడపగడపకు తిరగడానికి ఓపిక లేదని.. అందుకే రాజీనామా అని ఆయన అంటున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఏమీ లేదని ఆయన అనడం చూస్తోంటే.. అలాంటిది ఉన్నట్టుగా జగన్ కు ఫీడ్ బ్యాక్ వెళ్లినట్టు అర్థమవుతోంది.
కానీ బాలినేని మాటలను గమనిస్తే.. జగన్ కు, పార్టీ అధిష్టానానికి చేటు చేసే ఫీడ్ బ్యాక్ ఇస్తున్న శక్తులు కొన్ని తయారవుతున్నట్టుగా అనిపిస్తుంది. వారిని గుర్తించి జాగ్రత్త పడాలని జగన్ కు ఆయన సలహా ఇస్తున్నారు. మరి ఇలాంటి హిత వాక్యాలు జగన్ చెవికెక్కుతాయా? లేదా తాను తలచిందే చేస్తానని ఆయన మోనార్క్ లాగా వ్యవహరిస్తారా అనేది వేచిచూడాలి.
మామయ్య హితవాక్యాలు చెవికెక్కుతాయా?
Friday, November 22, 2024