ఉద్యోగ సంఘం రద్దుపై జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

Thursday, December 19, 2024

ఎపీలో ఉద్యోగులు తమ జీతభత్యాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ప్రశ్నిస్తూ, తమ హక్కుల సాధనకై ఆందోళనకు దిగుతూ ఉండడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం వారిపై కన్నెర్ర చేస్తున్నది. పైగా, కొద్దికాలం క్రింద నేరుగా రాష్ట్ర గవర్నర్ ను కలిసి తమ సమస్యల పరిష్కారంకు జోక్యం చేసుకోవాలని కోరడంతో తట్టుకోలేక పోతున్నది.

వారికి గవర్నర్ ను కలిసే సౌలభ్యం కలిగించిన రాజ్ భవన్ లోని సీనియర్ అధికారిని బదిలీ చేయగా, గవర్నర్ ను కలిసిన ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో పాటు వాణిజ్య పన్నుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్న కేఆర్ సూర్యనారాయణ పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది.

హైకోర్టు ఆదేశాలున్నా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపే చర్చలకు ఆయనను ఆహ్వానించడం  లేదు. పైగా, ఆయన అధ్యక్షుడిగా ఉన్న కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనకు మరోసారి హైకోర్టులో ఊరట లభించింది.

వాణిజ్య పన్నుల శాఖలో బదిలీల విషయంలో నిరసనలకు దిగి అసిస్టెంట్ కమిషనర్ ను నిర్బంధించారనే అంశంపై ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులను హైకోర్టు రద్దు చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

మరోవంక, కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను హైకోర్టు  సస్పెండ్ చేసింది.

ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. తాము నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని వారి తరఫు న్యాయవాదులు వాదించారు.

గతంలో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి గవర్నర్ ను కలిశామని, ఈ అంశంపై కూడా ప్రభుత్వం నుండి నోటీసులు వచ్చినట్లు గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం నోటీసును సస్పెండ్ చేసింది.

వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి గత ఎన్నికల సమయంలో ఉద్యోగులకు వైసీపీ ఇచ్చిన హామీల్ని గుర్తుచేస్తూ వాటిని అమలు చేయాల్సిందేనని పట్టుబడుతూ ఉండడం చికాకు కలిగిస్తుంది. ఇటువంటి సమయంలో తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో నవంబర్ 5 నుండి నిరవధిక సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించడంతో ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్దమైన్నట్లు స్పష్టం అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles