విజన్ 2047 పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో తాను ఏకీభవిస్తున్నట్టుగా చెబుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీ చర్చల్లో మోదీ పాలనపై పొగడ్తల వర్షం కురిపించడం ద్వారా ఆయన బీజేపీ వర్గాల నుండి ఎటువంటి సానుకూలత సంపాదించారో గాని, ఇప్పుడిప్పుడే ఆయన వైపు చూస్తున్న వామపక్షాలతో మాత్రం ఆగ్రహజ్వాలలు రగిలించినట్లయింది.
టీడీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి బిజెపి అగ్రనాయకత్వాన్ని మెచ్చిన చేసుకొనేందుకు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా వారు `ఛీ’ కొడుతూనే ఉన్నారు. పైగా, ఒక విధంగా తెలుగు ప్రజలు బిజెపిని తమకు అన్యాయం చేసిన్నట్లు భావిస్తున్నారు. దానితో ఆ పార్టీకి ఓట్లు నోటా కన్నా అధ్వాన్నంగా ఉన్నాయి.
కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వపు దౌర్జన్యాలు, అకృత్యాలపై పోరాడేవిధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకోవడానికి బదులు బిజెపికి దగ్గరైతే కేంద్ర ప్రభుత్వం నుండి `రక్షణ’ లభిస్తుందనే ఆశతో ఎదురు చూస్తుండటం ఒక విధంగా టిడిపి నాయకత్వాన్ని సొంత పార్టీ శ్రేణులలోనే బలహీనంగా భావించే పరిస్థితులకు దారితీస్తుంది.
వామపక్షాలకు ఏపీలో సొంతంగా పోటీచేసే, గెలుపొందే బలం లేకపోయినప్పటికీ అక్కడక్కడా గెలుపోటములను నిర్ధారించగల బలం వారికి ఉంది. పైగా, పోరాట పటిమ కూడా కొంతమేరకు ఉండడంతో జగన్ అకృత్యాలపై గొంతెత్తి నిరసన తెలుపగలరు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో టిడిపి అనూహ్యంగా మొత్తం మూడు సీట్లను గెల్చుకోవడం వామపక్షాలతో కుదుర్చుకున్న అవగాహన ఫలితంగానే కావడం గమనార్హం.
మూడు సీట్లలో కూడా టిడిపి అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. పరస్పరం రెండో ప్రాధాన్యత ఓట్లను మార్చుకోవాలని టిడిపి, వామపక్షాలు ఎన్నికల ముందు అంగీకరించాయి. ఇదే కలయిక వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతుందని రెండు వైపులా భావిస్తున్న తరుణంలో చంద్రబాబు మోదీని ప్రసంస్థలతో పైకెత్తేయడం వామపక్షాలకు మింగుడు పడటం లేదు.
ఈ విషయమై సిపిఐ ఇంకా బైటపడి తన అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినప్పటికీ సిపిఎం బహిరంగంగానే ఆగ్రవేశాలు వ్యక్తం చేసింది. చంద్రబాబు మాటలను చూస్తుంటే ఆయనకు రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మండిపడ్డారు.
“మోదీ విధానాలు దేశాన్ని సంక్షోభంలో నెట్టాయి.. ఆ మోదీ విధానాలనే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తోంది.. జగన్మోహన్‌రెడ్డితో ఇక్కడ పోట్లాడుతానంటూ ఆ విధానాలతో విభేదం లేనట్టు చెప్పటం అంటే ప్రజలను మోసగించడమే” అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు.
గతంలో చంద్రబాబు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విధానాలను అమలు జరిపినందుకే ప్రజల తిరస్కరణకు గురైన అనుభవం నుండి ఆయన ఇంతవరకు పాఠం నేర్చుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
మోదీ ఆర్థిక విధానాలతో ఏకీభవిస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు అదే మోడీ మతోన్మాద విధానాలపై పల్లెత్తు మాట అనకపోవడం,మన కళ్లెదుటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నా, పార్లమెంటరీ వ్యవస్థలను బలహీన పరుస్తున్నా, పార్లమెంట్లోగానీ బయటగానీ తెలుగుదేశం పార్టీ మాట్లాడకపోవడం గురించి విస్మయం వ్యక్తం చేశారు.
దేశంలో, బిజెపి పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపైన, దళితులపైన దాడులు చేస్తున్నా కనీసం మాట మాత్రం కూడా ఖండిరచకపోవడంపై చంద్రబాబు పునరాలోచించుకోవాలని శ్రీనివాసరావు హితవు చెప్పారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలపైనే మోదీతో విభేదిస్తున్నట్లు చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి గత నాలుగు సంవత్సరాలలో కనీసం దానిమీద ఎలాంటి ఉద్యమాలు నడప లేదని గుర్తు చేశారు.
ఇప్పటికైనా ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం బిజెపితో పోరాటానికి ముందుకు రావాలని సిపిఎం నేత స్పష్టం చేశారు. ఒక వంక వైఎస్ జగన్ తో పోరాటం అంటూ, మరోవంక జగన్ అక్రమ పాలనకు కవచంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో సయోధ్యకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటం టిడిపి మద్దతుదారులకు సహితం అంతుబట్టడం లేదు.