కాంగ్రెస్ పార్టీలో నిత్యం అసమ్మతి నేతగా వెలుగొందుతున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మాజీ పిసిసి అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్ కె ఎసరు పెట్టారు. వచ్చే ఎన్నికలలో ప్రస్తుతం ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్ననట్లు ప్రకటించారు.
నల్గొండ అంటే తనకు ప్రాణమని, అందుకే రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఏకపక్షంగా తేల్చి చెప్పారు. గతంలో నల్గొండ నుండి ఎమ్యెల్యేగా ఉంటూ వచ్చిన ఆయన 2018 ఎన్నికలలో ఓటమి చెందడంతో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలోభువనగిరినుండి పోటీచేసి గెలుపొందారు. అయితే ఆయన దృష్టి అంతా నల్గొండ మీదే ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
రంజాన్ సందర్భంగా నల్గొండలో జరిగిన కార్యక్రమంలో ఈ సంచలన ప్రకటనను కోమటిరెడ్డి చేశారు. మరోవంక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా జూన్ మొదటి వారంలో నల్గొండలో సభ నిర్వహిస్తామని, ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని కూడా ప్రకటించారు. అయితే, మే మొదటివారంలో ఎల్ బి నగర్ లో నిరుద్యోగ నిరసన కార్యక్రమంకు ప్రియాంక గాంధీని ఆహ్వానించినట్లు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత వారం ప్రకటించారు.
టిపిసిసి అధ్యక్షుడితో సంబంధం లేకుండా, స్థానిక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సంబంధం లేకుండా ప్రింయక గాంధీని ఆహ్వానించానని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల ముందు కుమ్ములాటలు మరింత తీవ్రతరం చేసేందుకే దారితీసే అవకాశం ఉంటుంది. తాను 20 ఏళ్లుగా నిజాయితీగా పని చేసి.. నల్గొండను అభివృద్ధి చేశానని చెబుతూ నల్గొండపై తనకే హక్కు ఉందన్నట్లు మాట్లాడారు.
కాగా ఈనెల 28న నల్గొండలో జరిగే నిరుద్యోగ నిరసన సభలో పాల్గొంటానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉంటే వాస్తవానికి నల్గొండలో ఎంపి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదినే నిరుద్యోగ నిరసన సభ జరగాల్సి ఉంది.. అయితే తనను సంప్రదించకుండా ఎలా సభ ఏర్పాటు చేస్తారంటూ కోమటిరెడ్డి ప్రశ్నించడమే కాకుండా , ఆ నిరసన సభలో పాల్గొనబోనని ప్రకటించారు. దీంతో అధిష్టానం పెద్దలు కోమటిరెడ్డితో మాట్లాడి ఆ నిరసన సభను ఈ నెల 28 వతేదికి వాయిదా వేశారు.
గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా సహాయ నిరాకరణ చేస్తుంటేవారు. నిత్యం అసమ్మతి వ్యక్తం చేస్తుండేవారు. టిపిసిసి అధ్యక్ష పదవి కోసం విఫల ప్రయత్నం చేశారు. ఒక విధంగా జిల్లాలో ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు ఎవ్వరితో కూడా వెంకటరెడ్డికి మంచి సంబంధాలు లేవు.