చంద్రబాబు కారుపై రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన ఎన్.ఎస్.జీ.

Monday, December 23, 2024

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆయన కారుపై రాళ్ల దాడి జరిగాయి. ఈ ఘటనలో చంద్రబాబు భద్రతా విధుల్లో ఉన్న ఎన్ఎస్ జీ కమాండెంట్ సంతోష్ కుమార్  తల పగిలింది.

ఈ ఘటనను ఢిల్లీలోని ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయం తీవ్రంగా పరిగణిస్తోంది. యర్రగొండపాలెంలో జరిగిన పరిణామాలపై ఆరాతీసింది. జరిగిన పరిణామాలపై ఎన్ఎస్ జీ బృందం తమ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించింది. ఆందోళనకారులను చంద్రబాబు సమీపానికి రానివ్వడం పట్ల ఎన్ఎస్ జీ ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

గతేడాది నందిగామలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరగ్గా, ఓ భద్రతాధికారికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో, నందిగామ, యర్రగొండపాలెం ఘటనలపై ఎన్ఎస్ జీ నివేదిక రూపొందిస్తోంది. దీనిపై ఆదివారం లోగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతకు ముందు, ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్న చంద్రబాబుపై రాళ్ళ దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖకు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. వీఐపీ భద్రతకు సంబంధించి స్థానిక పోలీసులు స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో జరిగిన ఘటనలు కూడా లక్ష్మీనారాయణ లేఖలో ప్రస్తావించారు. ఆందోళనకారులు దాడికి ముందుగా సిద్ధమైనప్పటికీ వారిని స్థానిక పోలీసులు నిరోధించకపోవడం పట్ల అభ్యంతరం తెలియజేశారు. చంద్రబాబుకు తగిన భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్నారు.

వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర హోంశాఖను కోరారు. లేఖను హోంశాఖ కార్యదర్శికి పంపుతూ, వీడియో క్లిప్పింగ్‌లను కూడా లక్ష్మీనారాయణ పంపించారు.
మరోవంక, మాజీసీఎం చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. పథకం ప్రకారమే ఎర్రగొండపాలెం ఘటన జరిగిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దాడి ఆ తర్వాత జరిగిన ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు  పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్  నిర్వహించారు. రాళ్ల దాడి, ఇతర పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా రాజ్‌భవన్‌కు టీడీపీ నేతలు వివరాలు పంపారు. అలాగే ఎర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటాలని పార్టీ నేతలకు చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

14 ఏళ్లు సీఎంగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై యర్రగొండ పాలెంలో దాడి చేశారని, ఇది ఏపీలో అరాచకానికి నిదర్శనమని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఎంపీ కనకమేడల రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎంకు ప్రసుత్తం సీఎం జగన్  ఇచ్చిన భద్రత ఇదేనా అని ప్రశ్నించారు.

ఏపీలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోలీసుల అనుమతితో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుపై దాడి పట్ల కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తీరు అసభ్యకరంగా ఉందని దుయ్యబట్టారు. ఆదిమూలపు సురేష్ దాడులు, పోలీసులతో మాట్లాడిన.. వీడియోలు అన్ని బయటకు వచ్చాయని తెలిపారు. ఎన్‌ఎస్‌జీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడ్డుపెట్టి.. చంద్రబాబును కాపాడారని కనకమేడల రవీంద్ర తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles